Heavy Rain | హైదరాబాద్ : మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా మూడున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లా జలమయమైంది. రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజీపల్లిలో 9.2, పాతూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక మెదక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు పలు ఇండ్లు, వ్యాపార సముదాయాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. గాంధీనగర్, సాయినగర్, వెంకట్రావ్ నగర్, పతేనహర్ కాలనీలు జలమయం అయ్యాయి. దుకాణ సముదాయాల ముందు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగాయి.
భారీగా వరద నీరు రహదారులపై నిలిచిపోవడంతో మెదక్ రాందాస్ కూడలి వద్ద డివైడర్‌ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వరద నీరును బయటకు వదిలారు. మెదక్‌లోని బాలికల జూనియర్ కాలేజీలోకి వరద నీరు రాగా, లెక్చరర్ల సహాయంతో బాలికలు సురక్షితంగా బయటపడ్డారు. ఇక హైదరాబాద్ – మెదక్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువును తలపిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భారీ వర్షానికి మళ్లీ నీట మునిగిన మెదక్
2 గంటల వ్యవధిలోనే 7 సెంటిమీటర్ల వర్షపాతం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
వెల్కమ్ బోర్డు వద్ద మెదక్ – హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా నిలిచిన వరద నీరు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు https://t.co/IkiEBsCJ0j pic.twitter.com/BpwF7eKt5M
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025