Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) వ్యాప్తంగా వాన దంచికొడుతున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు నీట మునిగాయి. భారీ వానకు దివిటిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఐటీ పార్కుకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. దీంతో ఓ కంపెనీకి చెందిన బస్సు అదుపుతప్పి కోతకు గురైన గుంతలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇక జడ్చర్లలో నల్లకుంట చెరువు అలుగుపోస్తున్నది. జాతీయరహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి పరిధిలో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తున్నది. వాగు ఉధృతికి కోస్గి-దౌల్తాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మక్తల్ మండలంలో కర్ని చెరువు అలుగుపారుతున్నది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
కాలువలో పడిపోయిన మహిళ..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో పెద్ద కాలువలో పడిపోయిన ఎల్లమ్మ(50)ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పయ్య, ఫైర్ శాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ అప్పయ్య, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి అభినందించారు.