కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావం కారణంగా పలు మండలాల్లో కురిసిన వర్షం కుండపోతను తలపించింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆదివారం మధ్యాహ్నం అతి భారీ వర్షం కురిసింది. గడిచిన రెండు రోజులుగా మధ్యాహ్నం సమయంలో ఇలాగే కురుస్తున్నది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి భారీగా వరద చేరింది. కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జిలో మోకాళ్లలోతు వరద నిలువడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట మండలంలో ఇప్పటికే పత్తి పంట తడిసి ఎర్రబారిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. అశ్వారావుపేట పట్టణంలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. విరామం లేకుండా భారీ వర్షం కురవడంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించింది.
వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు ; హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్మేస్తుండటం, దీనికి ఉపరితల ఆవర్తనం తోడుకావడంతో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు వెల్లడించింది. కాగా, గడిచిన 24గంటల్లో ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షం కురిసినట్టు తెలిపింది. అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో 10.95 సెం.మీ, ఖమ్మం జిల్లా కామేపల్లిలో 8.61 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లిలో 8.58 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.