హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7వ తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అక్టోబర్లో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1.23 డిగ్రీల మేర పెరిగినట్టు చెప్పింది. సాధారణ శీతాకాలం ప్రభావం కనిపించదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో లానినా అభివృద్ధి కాకపోవడం, బంగాళాఖాతంలో తుఫాన్లు, వాయుగుండాల ఏర్పాటుతో గాలుల ప్రవాహం నిలిచిపోవడం ఇందుకు కారణంగా ఐఎండీ పేర్కొంది.