Telangana | రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని పండించిన యాసంగి పంట కండ్లముందే వర్షార్పణమైంది. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం… కొనుగోలు కేంద్రాలను కాగితాలపైనే చూపించింది. కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా.. కాంటా పెడ్తలేరు.. ధాన్యం కొంటలేరు. రాష్ట్రవ్యాప్తంగా 7104 కేంద్రాలను ప్రారంభించి, 2480 కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. కొనేధాన్యానికి కూడా నానా కొర్రీలు పెడుతున్నారు. ఒకవేళ కొన్నా బస్తాలు లేక, మిల్లులకు వెళ్లక ధాన్యం కుప్పలు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో రైతులు పగలనకా, రాత్రనకా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు అకాల వర్షాల హెచ్చరికలు.. మరోవైపు మొద్దునిద్రలో పాలకులు.. వెరసి రైతులను బలిపీఠంపై నిలబెట్టారు. అధికారులు, పాలకులు ఎన్నికల బిజీలో ఉండగా.. అకాలవర్షాలు రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేశాయి. వాననీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి రైతుల కన్నీళ్లు కూడా వరదలా కారుతున్నాయి.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: అకాల వర్షం అన్నదాతలకు అంతులేని కష్టాల్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వం ధాన్యం సేకరణ వేగవంతం చేయకపోవడంతో భారీగా ధాన్యం వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులైనా.. ధాన్యం కొన్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల కాంటా వేసినా ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో బస్తాలు తడిసిముద్దయ్యాయి. శనివారం పలు జిల్లాల్లో కురిసిన గాలివానతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం నీళ్లపాలయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ మార్కెట్లు, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో రైతుల కండ్ల ముందే ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కూడా వానపాలయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రంగంపేట సెంటర్లో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం జంపన్న చెరువులో కలిసిపోయింది.
జనగామ, దేవరకద్ర, వనపర్తి మార్కెట్ యార్డుల్లో ధాన్యం బస్తాలన్నీ తడిసిపోయాయి. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, అక్కన్నపేట, సిద్దిపేట రూరల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుటుంబసభ్యులతో కలిసి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతూ, నీళ్లలోంచి వడ్లను వేరుచేస్తూ కనిపించిన దృశ్యాలు ఆవేదనకు గురిచేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. సరిపడా టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుంటే.. ఎన్నికల బిజీ పేరుతో రైతాంగాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
5 ఎకరాల్లో వరి వేసిన. ఐదు రోజుల కిందటనే పంట కోపిచ్చిన. ఐదు రోజుల నుంచి వడ్లు ఆరుతున్నాయి. ఒక గంట అయితే కాంటా అయితుండె. అసుంటిది క్షణాల్లో వాన పడి వడ్లు మొత్తం తడిసిపోయాయి. గింజలు చేతికి వస్తలేవు. ఏమీ తోస్తలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కోరుట్ల లక్ష్మి, ఆకులకొండూర్, నిజామాబాద్ జిల్లా
12 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. గిసుంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ సూడలేదు. సగం పంట తెచ్చింది తెచ్చినట్లే తడిసి పోయింది. సంచుల్లో నింపిన వడ్లు నాని పోయినయ్. 5 ఎకరాల్లో వరి కోసేది ఉంది. గాలివానకు మొత్తం నేలరాలింది. గొలలకు వడ్ల గింజలే లేవు. మొత్తం రాలిపోయినయ్. మా పరిస్థితి ఎట్లనో అర్థం అయితలేదు. పెట్టుబడి ఖర్చు సుతా ఎల్తదో ఎల్లదో. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– సుమన్, తిర్మన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా
ఈదురుగాలతో అచ్చిన వానకు ఎండబెట్టిన ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. 15 రోజుల నుంచి ఐకేపీ సెంటర్ కాడనే పడిగాపులు గాస్తున్న. ఆఫీసర్లు, రైస్‌మిల్లర్ల యజమానులు కుమ్మకై మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సెంటర్ల రైతులను పట్టించుకున్న వారే లేరు. చెడగొట్టు వానతోని మా గ్రామంలోని రైతులందరం నష్టపోయినం. రంగు మారిన వడ్లను ప్రభుత్వమే కొనాలె. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహరం చెల్లించాలె.
– పడిగె రాములు,సోమార్పేట,మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా