మణుగూరు టౌన్/ అశ్వాపురం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, ఏప్రిల్ 30 : భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, పాదచారులు, చిరువ్యాపారులు ఇబ్బందిపడ్డారు. అశ్వాపురం మండలం గోపాలపురం వద్ద ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది.
దీంతో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. రైతులు కల్లాల్లో పోసిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. డీజిల్ కొరతతో ఇప్పటికే వరికోతలు నిలిచిపోయాయి. ఇప్పుడు వర్షంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉక్కపోత, వేసవితాపం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.