Telangana | (నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్): ఈ ఏడాది పత్తి రైతు తెల్లబోయిండు. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి పత్తిరైతును నిండాముంచాయి. అష్టకష్టాల నడుమ పంట చేతికొచ్చాక మార్కెట్లో పత్తి రైతులకు మద్దతు కరువైంది. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల ఊసేలేకపోవడంతో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక మళ్లీ తెల్లబోవడం పత్తి రైతు వంతైంది. వానకాలం ఆరంభంలో వర్షాభావం వల్ల రైతులు పత్తి విత్తనాలను ఒకేసారి గాకుండా రెండు మూడుసార్లు నాటారు. తర్వాత ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవటం వల్ల పత్తి పంటలో చెట్లు ఏపుగా పెరగలేదు. ఒక్కో చెట్టు మూడు నుంచి నాలుగు అడుగులకే పరిమితమైంది. కోత దశలోనూ వానలు పడుతుండటంతో ఒక్కో ఎకరం పత్తి పంటలో పత్తి కోసేందుకు కూలీల అవసరం ఆరు నుంచి తొమ్మిది మందికి పెరిగింది. దూదికి బదులు కాయను తీసి తర్వాత వేరు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పెట్టుబడి భారం పెరిగింది. గతంలో పత్తిపంటలో ఐదారుసార్లు కోత ఉండేది. ఇపుడు మూడుసార్లు కోయగానే పంట లూటిఅవుతోంది. ఒక్కో ఎకరం పత్తి పంట నుంచి గతంలో వచ్చిన 10 నుంచి 12 క్వింటాళ్ల వచ్చే దిగుబడి ప్రస్తుతం యాభైశాతానికి పడిపోయింది.
రైతులు ఎకరం భూమిలో పత్తిని సాగు చేయడానికి అయ్యే పెట్టుబడి 3 సార్లు దుక్కి దున్నడానికి రూ.4500లు, అచ్చు చేయడానికి రూ.1500, రెండు విత్తనాల ప్యాకెట్లు రూ. 1700, విత్తనాలు నాటడానికి కూలీలు రూ. 900, గొర్రు తోలడానికి రూ. 6వేలు, కలుపు తీయడానికి రూ.5వేలు, మందులకు రూ.2వేలు, ఎరువుల బస్తాలకు రూ.4వేలు, మందుల పిచుకారికి రూ. 5వేలు, ఎకరాకు వచ్చే దిగుబడి 3 క్వింటాల్ పత్తి ఏరడానికి రూ.4,500లు, ఒక్క ఎకరానికి సుమారుగా రూ.35,100 పెట్టుబడి అవుతుండగా, ఎకరాకు దిగుబడి 3నుంచి 4 క్వింటాల్ దిగుబడి వస్తుంది. క్వింటాల్ పత్తికి రూ.7వేల చొప్పున 4క్వింటాళ్ల పత్తికి రూ.28వేలు మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరకు మద్దతు ధర కల్పించినప్పటికి రైతులకు పెట్టుబడి వచ్చే అవకాశం ఏ కోశాన లేదు. కాగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.
పెట్టుబడి పెరగటం, దిగుబడి తగ్గిన నేపథ్యంలో పత్తి రైతులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించటం లేదు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో రెండోది. ఈ ఏడాది ఏ ఒక్కరోజూ క్వింటా పత్తికి గరిష్ఠ ధర ప్రభుత్వ మద్దతు ధరను మించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు పత్తి రైతులకు ఇక్కడ గరిష్ట ధర క్వింటాకు రూ.7500 మాత్రమే దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర పత్తి క్వింటాకు రూ.7,521.
సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చేస్తున్న జాప్యం అన్నదాతకు శాపంగా మారి తే.. వ్యాపారులకు వరంగా మారుతున్నది. పత్తి సేకరణ ప్రారంభమై నెలరోజులు కావస్తు న్నా.. సీసీఐ జాడ లేకపోవడంతో గ్రామాల్లో కమీషన్ ఏజెంట్లు, పట్టణ కేంద్రాల్లో చిల్లరకాంటా వ్యాపారులు..మిల్లుల్లో యజమాన్యం రైతుల వద్ద పత్తిలో తేమ ఆధారంగా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నది. అధికారులు పట్టించుకోకపోవడంతో నాణ్యత ఉన్నా వ్యా పారులు మాత్రం ధర తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో యజమానులు, బయ ట మధ్యవర్తులు మంచి పత్తికి కూడా సవాలక్ష వంకలు పెట్టి ధర తగ్గించి కొంటున్నారు. వాస్తవానికి 8శాతం తేమ ఉంటే ఎ-గ్రేడ్ రకం పత్తి గా క్వింటాల్‌కు రూ.7,521, తేమ 9 నుంచి 12 శాతం ఉంటే ఒక్కో శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలన్న నిబంధన లు ఉన్నాయి. ప్రైవేటు మిల్లుల్లో యజమాను లు, ఏజెంట్లు, మధ్యవర్తులు మాత్రం రూ. 5,500 నుంచి రూ.6,250 వరకు చేతిలో పెడుతున్నారు. దీంతో ఒక్కో రైతు రూ.1000 నుంచి రూ.2000 వరకు ధరలో నష్టపోతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ శాతాన్ని సూచించే యంత్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అటు మిల్లుల్లో, ఇటు చిల్లర కాంటాల వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. నాణ్యతాప్రమాణాలు బాగానే ఉన్నా.. తేమ యంత్రాల్లో మాయాజాలంతో రైతన్న నెత్తిన టోపీ పెడుతున్నారు. వాహనాల డ్రైవర్లకు కమీషన్లు ముట్టజెప్పి రైతులు తెచ్చిన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
నేను 1.10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. అకాల వర్షాలు, వాతావరణం అనుకూలించకపోవడం వలన 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం లేదు. డిసెంబరు వరకు కాయాల్సిన పత్తి, పూత, కాత లేకపోవడంతో ఈనెలలోనే తొలగిస్తున్నాం. దిగుబడి లేక.. ధర రాక అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
ఎకరానికి రూ.15 వేల కౌలు ఒప్పందంతో నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం నాలుగు ఎకరాలకు రూ.1.40 లక్షల పెట్టుబడి పెడితే.. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. ఈ రోజు మొదటితీతలో తీసిన పత్తి పంటను తీసుకొస్తే క్వింటాల్ రూ.6,700కు అడిగారు. దీంతో కౌలు బాకీ కూడా పూడేటట్టు లేదు.