అయిజ/నందికొండ/కేతేపల్లి/పుల్కల్/మహదేవ్పూర్, ఆగస్టు 13 : కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నది. బుధవారం జూరాలకు 90 వేల క్యూసెక్కుల వరద రాగా 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జూరాల ద్వారా మొత్తం అవుట్‌ఫ్లో 91,340 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుతం 317.680 అడుగుల నీటిమట్టం ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 19,570 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 19,570 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రం వరకు 1,89,651 క్యూసెక్కుల వరద రాగా ఏడు గేట్లు పది ఫీట్ల మేర ఎత్తి 1,89,133 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 215.8070 టీఎంసీలకు గాను 202 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్తు కేంద్రాలు, కాలువల ద్వారా 2,96,246 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 588.80 (308.4658 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. ఎడమ, వరద కాలువకు నీటి విడుదలను నిలుపుదల చేయగా, కుడి కాలువకు నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు తగ్గించారు. మూసీ ప్రాజెక్టుకు వరద వస్తుండగా 5 గేట్ల ద్వారా 6,328.50 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలను నిలిపి వేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు బుధవారం 4,336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 11వ క్రస్ట్ గేటు 1.5 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 22.284 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌కు 1,11,685 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పెరిగిన వాహనాల లైఫ్‌ట్యాక్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వాహనదారులపై రవాణా శాఖ భారీగా పన్నుల భారం మోపింది. ఇప్పటికే వాహనాలను కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తుతున్న వాహనదారులకు లైఫ్‌ట్యాక్స్‌ను మరింత పెంచింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై లైఫ్‌టాక్స్‌ను రెండు నుంచి ఐదు శాతం వర కు పెంచింది. పాత వాహనాలపై ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం వరకు పన్నులు పెంచింది. గతంలో రూ.20 లక్షలు దాటిన ఏ వాహనానికైనా 18 శాతం పన్ను విధించేవారు. తాజాగా తాజాగా 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉన్న వాహనంపై 22 శాతం వసూలు చేయనున్నారు. ఇక రూ.50 లక్షలు దాటిన వాహనం పై 25 శాతం విధించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉత్వర్వులు జారీచేసింది.