హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో పొంగిపొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మూసీ వరద తాకిడికి పలు ప్రాంతాల్లో గుడులు కూడా మునిగిపోయాయి. పురానాపూల్ దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వాళ్లు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో ఆ బస్టాండును అధికారులు తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు చాదర్ఘాట్వద్ద చిన్నవంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపేశారు. దాంతో పెద్ద వంతెన పైనుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫలితంగా చాదర్ఘాట్పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరోవైపు మూసారాంబాగ్వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దాంతో అంబర్పేట్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసేశారు. మూసారాంబాగ్పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది.