Revanth vs Uttam | హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడట. కృష్ణా గోదావరి జలాలపై తమ ప్రజా ప్రతినిధులకు తర్ఫీదు ఇచ్చి బీఆర్ఎస్పై ఎగేయాలనుకున్న సీఎం రేవంత్‌కే సీన్ రివర్స్ అయినట్టు కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతున్నది. పీపీటీ లైవ్ కవరేజీ వ్యవహారం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నా యి. ఉత్తమ్ మాట్లాడుతుండగా సీఎం రేవంత్ కావాలనే లైవ్‌ను కట్ చేయించారని, తద్వారా మంత్రి ప్రజెంటేషన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా చేసి, సీఎం హైజాక్ చేశారనే చర్చ జరుగుతున్నది. సీఎం మాట్లాడినంత సేపు మాత్రం లైవ్ నిరాటంకంగా పని చేయడం గమనార్హం. దీంతో అనుమానాలు నిజమేననే వాదనలు వి నిపిస్తున్నాయి. సాంకేతిక సమస్య ఉంటే ఉత్త మ్ మాట్లాడుతున్నప్పుడు సగంలో అయినా పని చేయాలి కదా? సరిగ్గా సీఎం మాట్లాడటం మొదలుపెట్టగానే ఎలా పని చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గురువారం మధ్యాహ్నం ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు సీఎం రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశాన్ని ప్రజలు వీక్షించేలా ఐ అండ్ పీఆర్ లైవ్ లింక్ విడుదల చేసింది. ఉత్తమ్ మాట్లాడటం ప్రా రంభించిన ఐదు నిమిషాల తర్వాత లైవ్ లింక్ స్ట్రక్ అయింది. ఆ తర్వాత మూడు నిమిషాలకు పూర్తిగా నిలిచిపోయింది. కానీ మంత్రి ఉత్తమ్ సుమారు గంటన్నరపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా లైవ్ రాలేదు.
అప్పటివరకు పనిచేయని లైవ్ లింక్.. సీఎం రేవంత్ తన ప్రసంగం మొదలుపెట్టగానే పనిచేయడం ప్రారంభించింది. సీఎం మా ట్లా డిన గంటపాటు ఆటంకాలు లేకుండా లైవ్ కొ నసాగింది. ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు లైవ్ నిలిచిపోవడం, సీఎం మాట్లాడే సమయానికి లైవ్ మొదలుకావడం గమనార్హం.
తన లైవ్ ఎంతమంది చూశారు? రెస్పాన్స్ ఎలా ఉందని ఉత్తమ్ ఆరా తీయగా, మీరు మాట్లాడటం ప్రారంభించిన ఐదు నిమిషాలకే లైవ్ ఆగిపోయిందని అధికారులు చెప్పడంతో ఉత్తమ్ మైండ్ బ్లాంక్ అయ్యిందట. దీనికి కారణం ఎవరు? అంటూ ఆగ్రహోదగ్రులయ్యారని తెలిసింది. అసలు విషయం తెలియడంతో కోపోద్రిక్తుడైన మంత్రి వెంటనే రేవంత్ కు ఫోన్ చేసి లైవ్ ఎందుకు కట్ చేయించారం టూ నిలదీసినట్టు సమాచారం. మీ ఇష్టమొచ్చినట్టు చేస్తారా? సీనియర్ మంత్రిగా గౌరవం ఇవ్వ రా? మీ ఒక్కరికే మైలేజ్ కావాలా? అంటూ ఊగిపోయినట్టు చర్చ జరుగుతున్నది.
ఇద్దరి మధ్య జరిగిన ‘లైవ్’ రగడ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం అసెంబ్లీలో, లాబీల్లో ఇదే చర్చ జరిగింది. మంత్రి ఉత్తమ్ భావించినట్టుగా ఆయన ప్రసంగం లైవ్‌ను సీఎం రేవంత్ ఆపేయించారా అనే సం దేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నా యి. రేవంత్ కావాలనే చేయించారనే చర్చ జరుగుతున్నది. ఉత్తమ్‌ను బుల్డో జ్ చేయడం ద్వారా నీళ్ల విషయంలో తాను పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఉత్తమ్‌ను డమ్మీ చేసి.. అంతా తానే అనే సంకేతాలు ఇవ్వాలనే ఆలోచన సీఎం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.