వరంగల్ హెల్త్ సిటీ దసరాకు సిద్ధం
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన (హెల్త్ సిటీ) దసరా నాటికి సిద్ధమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
- అత్యాధునిక వసతులతో పేదల కోసం దవాఖాన
- గుండె సర్జరీలు చేసిన లండన్ వైద్యులకు థ్యాంక్స్
- అభినందన సభలో మంత్రి
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన (హెల్త్ సిటీ) దసరా నాటికి సిద్ధమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతోపాటు నగరం నలువైపులా టిమ్స్ దవాఖానల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. లండన్ నుంచి వచ్చి నిమ్స్‌లో 9 మంది పిల్లలకు గుండె సర్జరీలు చేయడంలో సహాయ పడిన వైద్య బృందానికి శనివారం అభినందన సభ నిర్వహించారు. నిమ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. పసి హృదయాలను కాపాడేందుకు ప్రభుత్వ ఆహ్వానం మేరకు నిమ్స్‌కు వచ్చిన బ్రిటన్ వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ బృందానికి నేతృత్వం వహించిన తెలంగాణ బిడ్డ, జగిత్యాలవాసి డాక్టర్ వెంకటరమణ దన్నపనేనిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేక బృందం, నిలోఫర్, నిమ్స్ వైద్యులు కలిసి 9 మంది చిన్నారులకు సర్జరీలు చేశారని తెలిపారు. ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేశారని, ఇదొక గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి, కార్డియాక్ సర్జరీ విభాగం హెడ్ అమరీశ్, సర్జరీలో భాగస్వాములైన ప్రతి ఒకరికీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు విదేశీ వైద్య నిపుణులను తీసుకొచ్చి, ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన ఘనత ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత నిమ్స్కే దక్కిందని చెప్పారు.

పిల్లలు నవ్వుతుంటే ఎంతో సంతోషంగా ఉన్నది
చిన్నపిల్లలకు గుండె సర్జరీ చేయడం అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటివారికి నిమ్స్ ఆశాదీపమని చెప్పారు. 9 మందికి నిమ్స్‌లో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. సర్జరీ తర్వాత కోలుకున్న పిల్లలతో తాను మాట్లాడానని, వారి నవ్వులు చూస్తుంటే ఎంతో సంతోషమైందని తెలిపారు.
డాక్టర్ రమణను ఆదర్శంగా తీసుకోవాలి
పుట్టిన గడ్డకు, సొంత రాష్ర్టానికి ఏదైనా చేయాలన్న తపన డాక్టర్ రమణలో కనిపించిందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ‘ఆయన మూడు నెలల కింద నన్ను కలిశారు. సర్జరీలు కావాల్సిన పిల్లలను మీరు సిద్ధం చేయండి. నేను నా బృందంతో వచ్చి వారికి శస్త్రచికిత్స చేస్తాను అని చెప్పారు. అన్నట్టుగానే ఆరుగురు సభ్యుల టీమ్‌ను వెంట తీసుకొని వచ్చి, నిమ్స్, నిలోఫర్ దవాఖాన వైద్యులతో కలిసి సర్జరీలు చేశారు’ అని కొనియాడారు. డాక్టర్ రమణను స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని పిలుపు ఇచ్చారు.
మంత్రి హరీశ్ రావు.. రియల్ హీరో: డాక్టర్ రమణ
డాక్టర్ రమణ మాట్లాడుతూ.. ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ, విజన్‌తో, చిత్తశుద్ధితో కృషి చేస్తున్నవారు తన దృష్టిలో రియల్ హీరోలని, మంత్రి హరీశ్‌రావు అలాంటివారిలో ఒకరని కొనియాడారు. సర్జరీలకు ఏయే వసతులు కావాలో అడిగిన మరుసటి రోజే అవన్నీ సమకూర్చారని చెప్పారు. తన కెరీర్లో ఇప్పటివరకు అనేక దేశాల్లో అనేక మంది రాజకీయ నాయకులను కలిశానని, అయితే ఇంత వేగంగా స్పందించిన నేత మాత్రం లేరని తెలిపారు. తమకు ఇలాగే సహకారం అందిస్తే.. ఐదేండ్లలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పిల్లల గుండె శస్త్రచికిత్స విభాగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.
చిన్నారులకు మంత్రి ఆత్మీయ పలకరింపు
సర్జరీ అనంతరం కోలుకుంటున్న చిన్నారులను మంత్రి హరీశ్‌రావు పలకరించారు. ఐసీయూలో ఒక్కో చిన్నారి దగ్గరికి వెళ్లి, వారి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమం అనంతరం సర్జరీల్లో పాలుపంచుకున్న విదేశీ వైద్యబృందంతోపాటు నిమ్స్, నిలోఫర్ వైద్యులను ప్రత్యేకంగా సన్మానించారు. వారికి చేతితో తయారు చేసిన చార్మినార్ నమూనాలను బహుమతిగా అందజేశారు. ఆత్మీయ సత్కారం, ఆదరణ చూసి లండన్ బృందం సంతోషం వ్యక్తం చేసింది.
లండన్ నుంచి వచ్చిన బృందం
- డాక్టర్ రమణ దన్నపునేని (సర్జన్)
- డాక్టర్ పౌ డాంగ్ (కార్డియాలజిస్ట్)
- డాక్టర్ మేరీ హారన్ (ఇంటెన్సివిస్ట్)
- డాక్టర్ ఆనంద్ వాఘ్ (ఇంటెన్సివిస్ట్)
- డాక్టర్ ఎండీ సలీమాన్ (అనస్థీషియా)
- సిస్టర్ సుజానే షా
- సిస్టర్ లిని సాజి
- సిస్టర్ జానే యంగ్
- ప్రొఫెసర్ రాకేశ్‌కుమార్
సర్జరీ అయిన పిల్లల తల్లుల స్పందన
రూపాయి ఖర్చు కాలేదు
మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఇప్పుడు నా కూతురు వయసు ఏడాది. నా బిడ్డకు దగ్గు, జలుబు ఎక్కువగా వచ్చేది. డాక్టర్లకు చూపిస్తే గుండె సమస్య ఉన్నదని చెప్పారు. ప్రైవేట్ దవాఖానలో సర్జరీ చేయాలంటే రూ.30 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. నిమ్స్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది.
సర్కారు వైద్యమే నయం
నాకు కూతురు పుట్టిన 10 రోజుల తర్వాత గుండె సమస్య ఉన్నట్టు తెలిసింది. చాలా మంది ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాలని సూచించారు. కానీ.. నేను ప్రభుత్వ దవాఖానపై నమ్మకం పెట్టుకున్నాను. అక్కడికి వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవడం కన్నా ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని రకాల వసతులు ఉన్నాయని బలంగా నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెడుతూ నా బిడ్డకు విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యబృందానికి, విదేశీ నిపుణులకు నా ధన్యవాదాలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

