హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని అటవీ భూముల్లో ప్రభుత్వం జరిపిన విధ్వంసాన్ని సుప్రీంకోర్టు మరోసారి తప్పుబట్టింది. 400 ఎకరాల్లోని అడవులను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్‌చంద్రన్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ‘సుస్థిరాభివృద్ధికి నేను అనుకూలమే. అయితే దాని అర్థం రాత్రికి రాత్రే 30 బుల్డోజర్లను తీసుకొచ్చి మొత్తం అటవీ భూములను ధ్వంసం చేయడం కాదు’ అని పేర్కొన్నారు.
ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కే పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందించేందుకు సమయం కోరగా, కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన విచారణ సందర్భంగా ‘కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అడవులను పునరుద్ధరిస్తారా? లేదంటే మీ అధికారులను జైలుకు పంపమంటారా?’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.