హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద్దరూ పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక, భౌతికపరమైన పక్కా అధారాలున్నాయి. వీరి మీ ద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీక ర్ విశ్వసనీయతను శంకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతున్నది. మరో వైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులను ఇప్పటికే వీళ్లిద్దరూ ధిక్కరించారు. విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణ యం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లోకి గోడ దూకారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ 10 ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోడానికి స్పీకర్ వెనకాముందాడటంతో బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశిం చింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. రెండు విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఉన్నారు. కారు గుర్తు మీద స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పని చేశారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఈ ఇద్దరిపై వేటు తప్పదని సమాచారం. అందుకే వేటు కంటే రాజీనామా బెటర్ అని ఇద్దరూ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాజీనామా చేయించడమే ఉత్తమమని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మాట్లాడనున్నట్టు తెలిసింది. సీఎంతో పాటు ఏఐసీసీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తున్నది.
సుప్రీకోర్టు విధించిన గడువులోగా ఫిరాయింపుదారులను విచారించి, వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన తెలంగాణ శాసనసభ స్పీకర్‌ది కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. బీఆర్ఎస్ నుంచి గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేలపై ధర్మాసనం సూచించిన గడువులోగా ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ధర్మాసనమే ఒక నిర్ణయం తీసుకోవాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. జస్టిస్ గవాయ్ బెంచ్ కేసులను విచారించనున్నది. గతంలోనే బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ మరో రెండు పిటిషన్లు వెసింది.