హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఓటుకు నోటు కేసులో నిందితులు సీఎం ఏ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్, రెండు సంవత్సరాల తర్వాత తనను చేర్చారని సండ్ర ఈ పిటిషన్లు వేశారు. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని కూడా సండ్ర వెంకటవీరయ్య కోరారు. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని న్యాయవాది ఆర్యమసుందరం కోరారు. ఇంప్లీడ్ను అనుమతించవద్దని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. దీనిపై శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. మత్తయ్యను కేసు నుంచి తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లాయర్లు ప్రస్తావించారు. ఆ తీర్పు కాపీలను జతచేయాలని ధర్మాసనం ఆదేశించింది.
‘ఓటుకు నోటు’ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జెరూసలేం మత్తయ్యపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. మత్తయ్య పేరును కేసులో క్వాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని తెలిపింది. ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ నెల 22న ఇరువైపులా వాదనల తర్వాత తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం శుక్రవారం తీర్పును వెల్లడించింది.
ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న చంద్రబాబునాయుడు దోషిగా తేలితే, టీడీపీ మద్దతుమీద ఆధారపడిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని ఈ కేసులో 4వ నిందితునిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పేర్కొన్నారు. అందుకే ఈ కేసు నుంచి తనను తప్పించారని ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఒక్క నిమిషం కూడా పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు.