Gandhi Hospital | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మరణ మృదంగం మోగుతున్నది. పాలకుల పర్యవేక్షణా లోపం, అధికారుల నిర్లక్ష్యం, వైద్యుల కొరత కలగలిసి నిండు ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒకే నెలలో 50 మంది శిశువులు, 14 మంది తల్లులు మృత్యువాత పడినట్టు సమాచారం. అయితే ఈ మరణాల విషయమై వివరణ కోరేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరూ స్పందించలేదు. ఒక్క గాంధీ దవాఖానలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్, నిలోఫర్ టీచింగ్ దవాఖానతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ దవాఖానల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదో అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు రోగుల బంధువులు.
ఏడాది క్రితం వరకు తగ్గుముఖం పట్టిన మాతా శిశు మరణాలు గత ఎనిమిది నెలలుగా పెరుగుతుండటంతో ప్రజలు సర్కార్ దవాఖానలంటేనే జంకుతున్నారు. దీనికితోడు ఇటీవల జరిగిన బదిలీల్లో సీనియర్ వైద్యులందరినీ బదిలీ చేయడంతో ప్రస్తుతం గాంధీ దవాఖానలో అనుభవజ్ఞులైన వైద్యులు పెద్దగా లేరనే ప్రచారానికి నమోదవుతున్న మరణాల సంఖ్య బలాన్ని చేకూరుస్తున్నది. గత తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ సర్కార్ పలు రకాల ఆరోగ్య పథకాలను నిలిపివేసింది. దీనికితోడు గర్భిణీ మహిళలు, బాలింతలకు సరైన పోషకాహారం లభించక, మెరుగైన వైద్యం అందించేందుకు అనుభవజ్ఞులైన వైద్యులు కరువై పురిట్లోనే శిశువులు కన్నుమూస్తున్నారు. తల్లులు సైతం మృత్యువాత పడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖాన ఘటనలో ఇద్దరు అమాయక వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిసింది. శిశు మరణాలకు సంబంధించి సమాచారం బయటకు పొక్కడంపై అధికారులు, పాలకులు కలిసి అమాయక వైద్యులను బలిపశువులను చేసినట్టు సమాచారం. జరిగిన ఘటనకు కప్పిపుచ్చుకునేందుకు అధికారులు యత్నిస్తున్నట్టు వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. అయితే వైద్యుల సస్పెన్షన్ విషయంపై రాత్రి వరకు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.