నాగర్‌కర్నూల్, జనవరి 20: ఎంజీకేఎల్ఐ పనులు చేపట్టేందుకు రూ.38 కోట్ల నిధులను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి విడుదలకు కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి మంత్రి సందర్శించారు.
కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఐడీవోసీలో ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యా, వైద్యంతోపాటు ఇరిగేషన్, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఎంజీకేఎల్ కింద పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వడానికి మరో రూ.387 కోట్ల నిధులు అవసరమని, అందులో రూ.350 కోట్లు భూసేకరణకు చెల్లించాల్సి ఉన్నదని, ప్రస్తుతానికి రూ.38 కోట్లు విడుదల చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.