హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో అక్రమార్కులను ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినట్టు తెలిసింది. టీవీవీపీ, డీఎంఈ, డీహెచ్, టీజీఎంఎస్ఐడీసీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగాల హెచ్వోడీలతో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం.
ఏండ్లుగా పాతుకుపోయి యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. వైద్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల అవినీతి బాగోతాన్ని వెలికితీస్తూ ‘నమస్తే తెలంగాణ’లో ‘వైద్యశాఖలో వసూళ్ల బ్యాచ్’ పేరిట సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనం వైద్యారోగ్యశాఖలో దుమారం రేపింది. దీంతో సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.