హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ఆరోగ్య పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళ రావు నగర్ మధురానగర్ కమిటీ హాల్, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్ లో గల గౌరీశంకర్ కాలనీలో కంటి వెలుగును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజలకు మేలు జరిగేలా ఉంటాయి. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగు దేశంలోనే గొప్పదని’ అన్నారు. ఈ కార్యక్రమం కోసం రూ. 250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. నగరంలోని 91 వార్డులలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.
కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్ళద్దాలు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ లు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు.ప్రైవేట్ హాస్పిటల్స్ లో కంటి పరీక్షలకు, చికిత్సలకు ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే గోపీనాథ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్లు దేదీప్య రావు, కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.