కొండాపూర్, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో అమెరికన్ తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ కల్చరల్ అండ్ బిజినెస్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్లతో చర్య లు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, దవాఖాన
వైద్యసేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి దయాకర్‌రావు చెప్పారు. ప్రవాస భారతీయులు సొంత గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్యకారిణి పద్మజారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఏటీఎస్, టీటా ప్రతినిధులు కరుణాకర్ మాధవ్, నరేందర్‌రెడ్డి, వెంకట్ మంతెన, రాంచందర్‌రెడ్డి, సందీప్ మక్తాల పాల్గొన్నారు.