మాయమాటల కాంగ్రెస్‌పై (Congress)తెలంగాణ (Telangana)పల్లె తిరగబడింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టి.. గద్దెనెక్కిన తర్వాత హామీలు అటకెక్కించడాన్ని జనం నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ‘పల్లె పోరు’లో (Panchayathi Elections) భాగంగా మళ్లీ ఓట్ల కోసం వచ్చిన ‘హస్తం’ నేతలు మరోసారి అవే హామీలు గుప్పిస్తుండటంతో ప్రజలు ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, అమలుకాని పథకాలు, యూరియా కొరత, రుణమాఫీ మోసంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.
నమస్తే తెలంగాణ, నెట్వర్క్, డిసెంబర్ 7: సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ నిలదీశారు. తమకు ఇండ్లు లేవని, మంజూరు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున మహిళలు డిమాండ్ చేయడంతో గందరగోళంగా మారింది. ఇలా కాదమ్మా అంటూ వారిని వారిస్తూ.. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చిందని, పదేండ్లలో బీఆర్ఎస్ 30 ఇండ్లు ఇచ్చిందని, తాను వచ్చిన తర్వాత 200 ఇండ్లు ఇచ్చానని, కానీ ఇక్కడ వెయ్యి ఇండ్లు అవసరం ఉంటాయని, మిగతా వారికి కూడా ఇస్తామంటూ నచ్చజెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆరు గ్యారెంటీలు అమలుచేయకపోవడంపై ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చె రువుకొమ్ము తండాలో వర్ధన్నపేట ఎ మ్మెల్యే కేఆర్ నాగరాజును గిరిజనులు నిలదీశారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం కోసం వచ్చి ఎమ్మెల్యే, తండావాసులతో మాట్లాడుతున్న క్రమంలో స్థానికులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, పెన్షన్లు ఇవ్వడం లేదని, రుణమాఫీ వ ర్తించలేదని, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలతో ఎదురుదాడి చేయడంతో సమాధానం చెప్పలేక అక్కడినుంచి జారుకున్నారు. నా యకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గని ప్రజలు హామీలు అమలయ్యేదాకా తండాలో ఓట్లు అడిగేందుకు రావొద్దంటూ హెచ్చరించారు.