ఆదిలాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు పది నెలల కాంగ్రెస్ పాలనపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. పోస్టుకార్డుల ద్వారా తమ ఆగ్రహాన్ని ఢిల్లీ హస్తం పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూడు భాషల్లో ఉత్తరాలు రాశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500, రైతు భరోసా పథకం కింద 15 వేలు, వృద్ధాప్య పింఛన్లు 4 వేలు, దివ్యాంగ పింఛన్లు రూ.6 వేలు, కొత్త రేషన్ కార్డులతోపాటు ఇతర పథకాలను వంద రోజుల్లో అమ లు చేస్తామని చెప్పిందని, రాష్ట్రంలో అధికారంలో వచ్చి 300 రోజులు గడుస్తున్నా ఆ పథకాలకు అతీగతీ లేదని వారు పేర్కొన్నారు. గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అర్హులైన వారు చాలా రోజులుగా ఎదురుచూస్తుండగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆ ఉత్తరాల్లో డిమాండ్ చేశారు.
ముక్రా(కే) గ్రామంలో 210 కుటుంబాలు ఉండగా 1080 జనాభా ఉన్నది. వీరంతా వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతారు. బీఆర్ఎస్ పాలనలో ముక్రా (కే) ఆదర్శ గ్రామంగా పలు ప్రశంసలు అందుకున్నది. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముక్రా(కే)లో రూ.37 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ రెండు నుంచి ఆరు పథకాలు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నా రు. పల్లెప్రగతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారీ చేసి రూ.10 లక్షల వరకు ఆదాయం గడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ గ్రామ పంచాయతీకి పలు అవార్డులు వచ్చాయి. 2020లో స్వచ్ఛ సర్వేక్షన్, 2022లో బయో డైవర్సిటీ, 2022లో దీన్ దయాళ్ స్వశక్తీకరణ్, 2023లో స్వచ్ఛ సజల్ శక్తి సమ్మాన్, 2023లో గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ అవార్డులను ముక్రా(కే) సొంతం చేసుకున్నది. రోడ్డుకు ఇరువైపులా స్థానికులు నాటి న మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తుంది. ముక్రా(కే)లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ సరిగా అమలు కాలేదు. 221 మంది రైతులకు గాను కేవలం 49 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది. అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని ఇటీవల రైతులు సెల్ఫీలు దిగి ముఖ్యమంత్రికి పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 300 రోజులు గడుస్తున్నా 6 గ్యారెంటీలను అమలు చేయలేదని మరోసారి నిరసన చేపట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి మోసం పోయాం. పేదలు పింఛన్లు పెరుగుతాయని, రైతులు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసాలో భాగంగా రూ.15 వేలు, మహిళలు నెలకు రూ.2,500 వస్తాయని ఆశపట్టారు. అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు మాటమార్చారు. 300 రోజులు గడుస్తున్నా ఈ పథకాలు అమలు కావడం లేదు. మా పంచాయతీలో బీఆర్ఎస్ పాలనలో రూ. 37 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమీ చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు.