మరికల్, జనవరి 6 : అభం.. శుభం తెలియని చిన్నారులను ఓ తండ్రి అతి కిరాతంగా హత్యచేసి, ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయ విదారక ఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్సై రాము, స్థానికుల కథనం మేరకు .. మరికల్ మండలం తీలేరుకు చెందిన చాకలి శివరాం (35)కు ఊట్కూర్ మండలం పెద్దజట్రంకు చెందిన సుజాతతో 9 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుతిక(8), చైతన్య (6) సంతానం.. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి కొన్నాళ్లు ఉండగా.. కుటుంబకలహాలతో ఆరేండ్ల కిందట భర్త నుంచి భార్య సుజాత విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. కోర్టు నుంచి గతేడాది విడాకులు పొందారు. నాటి నుంచి శివరాం తీలేరులో పిల్లలతోపాటు ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రుతిక 4వ తరగతి చదువుతుండగా.. చైతన్య ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం రుతికకు శరీరంపై దురుద పెడ్తుందని చెప్పడంతో కూతురు, కొడుకుతోపాటు దవాఖానకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పాడు. రాత్రి 8 గంటల సయమంలో శివరాం మరదలు చంద్రకళ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని ప్రశ్నించగా.. మరికల్ దవాఖానలో ఉన్నట్టు సమాధానం చెప్పాడు.
రాత్రి 10 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. శివరాం పిల్లలతో కలిసి గ్రామంలోని వారి పొలం వద్ద ఉన్న గుడిసెకు వెళ్లారు. అక్కడ ఇద్దరు చిన్నారులు నిద్రపోగా అప్పటికే జీవితంపై విరక్తితో ఉన్న శివరాం ఒక్కసారిగా.. చిన్నారులను ఒకరి తర్వాత ఒకరి గొంతుకు తాడుతో ఉరేశాడు. అనంతరం సమీపంలోని కోయిల్‌సాగర్ డీ-16 కాల్వపై ఉన్న కల్వర్టు బ్రిడ్జి కింద నీళ్లల్లో వేసి తొక్కి చంపాడు. ఆ తర్వాత తానూ గడ్డి మందు తాగాడు.. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి వైర్‌ను పట్టుకోగా షాక్ కొట్టి కిందపడిపోయాడు. మూడో ప్రయత్నంగా.. బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తన స్నేహితుడు శ్రీనుకు ఫోన్ చేసి పిల్లలను చంపి, తానూ చనిపోయేందుకు యత్నించినట్టు వివరించాడు. శ్రీను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మరికల్ ఎస్సై రాము సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. శివరాంను హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. చిన్నారుల మృతదేహాలను నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్సై రాములు తెలిపారు.