Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ విమర్శలు గుప్పించారు. రేవంత్ నేమ్ ఛేంజర్ మాత్రమేనా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఆదరాబాదరాగా మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయించుకున్నాడని గుర్తుచేశారు. కానీ దానికి మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాలంటే అనుబంధంగా ఒక పెద్ద ఆస్పత్రి ఉండాలనేది మనోడికి తెల్వదని విమర్శించారు. సో, రేపు మెడికల్ కౌన్సిల్ వాళ్లు తనిఖీలకు వస్తారనగా.. రాత్రికి రాత్రి తాండూరు జిల్లా ఆస్పత్రి బోర్డును మార్చేసి కొడంగల్ ఆస్పత్రి అని పెట్టేశాడని అన్నారు.
రేవంత్ రెడ్డికి ఏదీ కొత్తగా కట్టడం శాతగాదని కొణతం దిలీప్ అన్నారు. పేర్లు మార్చడం మాత్రమే తనకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ఈయన వ్యవహారమని విమర్శించారు. ఈ అతితెలివితోనే తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం బట్టిస్తున్నాడని విమర్శించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి కుట్రనే అని పేర్కొంటూ దవాఖాన ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తాండూరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. తాండూరువాసులకు ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా పేరు మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయడంలో భాగంగా తాండూరు దవాఖానను దానికి అనుసంధానంగా చేసే కుట్రలో భాగంగానే పేరు మార్చినట్టు ఆరోపించారు. తాండూరు నియోజకవర్గాన్ని కొడంగల్‌గా మార్చి ఇక్కడి ఎమ్మెల్యేను కొడంగల్ ఎమ్మెల్యేగా చేస్తారా..? ప్రజలను కొడంగల్వాసులుగా మారుస్తారా..? అని ధ్వజమొత్తారు. కాంగ్రెస్ వివక్షపాలనలో భాగంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకే ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.