కౌటాల, జూన్ 10: ‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్‌ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగింది. తలోడి గ్రామానికి చెందిన అరికెల పద్మ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, సర్వే చేసిన అధికారులు జాబితాలో ఆమె పేరును చేర్చారు.
కానీ, అర్హుల లిస్టులో ఆమె పేరు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. తను దళిత వితంతు మహిళనని, తనతోపాటు తన వదినలు అరికిల్ల మాధవి, అరికిల్ల రాజేశ్వరి.. నలుగురు పిల్లలు కలిసి తడికెలతో వేసుకున్న పాకలో ఉంటున్నామని వివరించారు.
భవంతులు ఉన్న వారికి ఇండ్లు మంజూరయ్యాయి కానీ, గుడిసెలో ఉంటున్న తనకు ఎందుకు మంజూరు కాలేదని ఎంపీడీవో రమేశ్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. కలెక్టర్ నుంచి వచ్చిన లిస్టులో మీ పేరు లేదని, ఏంకావాలన్న కలెక్టర్‌ను అడుక్కోండని, లేదా ఇల్లు రాలేదని సీఎంకు పోయి చెప్పుకోండని దురుసుగా మాట్లాడారని ఆమె ఆరోపించారు.