Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘అవును మేము గుంటనక్కలమే.. మీలాగా పందికొక్కులం కాదు.. ఇక్కడికి రండి.. జింకలు, పశు పక్ష్యాదులు ఎక్కడున్నాయో వర్సిటీ భూముల్లో చూపిస్తం’ అని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్‌సీయూకి చెందిన ఓ విద్యార్థిని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడిన విషయాలు ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లో జింకలు ఉన్నఫలంగా ఎలా వస్తాయి? ఎవరు తీసుకొస్తారు? జల్, జమీన్, జంగల్ మావే.. ఇక్కడ ఉన్న పిచ్చుక, పక్షి, జంతువు అన్నింటినీ కాపాడాలనుకుంటున్నాం. కేవలం రాజకీయలబ్ధి కోసమే పచ్చని అటవీ ప్రాంతాన్ని చెరబట్టడం ఎంతవరకు న్యాయం.
అసెంబ్లీలో తెగిస్తాం.. అని ఒక సీఎం మాట్లాడుతారా? ఒక రౌడీలా మాట్లాడారని విమర్శించారు. మూగజీవాలకు ఆవాసమైన అడవిని కాపాడుకునేందుకు వెనుకడుగు వేయబోం, ప్రభుత్వంతో ఎంతవరకైనా పోరాడుతాం. మమ్మల్ని గుంటనక్కలు అంటూ ఎక్కడో కూర్చొని అనడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి.. హెచ్‌సీయూలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి. ఇక్కడున్న బయోడైవర్సిటీ నగరానికి ఊపిరిలాంటిది. ఇది నాశనమైతే మనం బతకడం కష్టం.. అని ఆ విద్యార్థిని హెచ్చరించింది.