నిన్నటివరకూ చెంగుచెంగున ఎగిరి దుంకిన అక్కడి జింక పిల్లల బతుకు కుక్కల చేతిలో విస్తరిలా మారింది. 200 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన అక్కడి మష్రూమ్ రాక్ మౌన రోదన చేస్తున్నది. మొన్నటి వరకూ నిశ్చింతగా కనిపించిన అక్కడి కొలనులు కకావికలమౌతున్నాయి. క్యాన్సర్ వంటి రోగాలను నయం చేసే ఔషధ వృక్షాలు, 200 వరకూ పక్షి జాతులు ఇలా చెప్పుకొంటూ పోతే జీవ వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలిచిన కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ అడవి అల్లకల్లోలంగా మారింది. ఆదాయమే పరమావధిగా హెచ్‌సీయూ భూములపై రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దుశ్శాసన పర్వంతో అక్కడి చెట్టు, పుట్ట, జీవాలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నాయి మరి.
పూల మొక్కల జాతులు 700
క్షీరద జాతులు 10
సరీసృపాల జాతులు 15
పక్షి జాతులు 200
HCU Lands | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) నిరసన ప్రదర్శనలకు వేదికగా మారింది. హెచ్‌సీయూ భూములపై రేవంత్ ప్రభుత్వం కత్తిగట్టడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను ధైర్యంగా వెలిబుచ్చుతున్నారు. అభివృద్ధి పేరుతో క్యాంపస్ వాతావరణం బలికావడానికి వారు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల పచ్చని భూమిని టెక్నాలజీ పార్క్ పేరిట ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం వేలం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు.
విద్యార్థులకు ఇది నిరసన మాత్రమే కాదు. ప్రాణం కోసం పోరాటం. ఇది చరిత్ర, పర్యావరణం, అభివృద్ధి.. మూడూ ఉన్న త్రివేణి సంగమం. హైదరాబాద్ చరిత్రలో భాగమైన, జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉన్న ఈ హెచ్‌సీయూ ప్రాంతం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పర్యావరణపరంగా సుసంపన్నమైన ఈ భూమిని వేలం వేయాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రణాళికలపై పౌర సమాజ సంస్థలు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
15 ఏండ్ల కిందట ఆగస్టు 2008-ఆగస్టు 2009 మధ్య హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకులు, ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రతినిధులు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాష్ట్ర డైరెక్టర్ ఫరీదా తంపాల్ నేతృత్వంలో హెచ్‌సీయూలో సర్వే చేపట్టారు. ఈ బృందం హెచ్‌సీయూలోని వివిధ రకాల జీవ జాతుల వివరాలతో ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికలో మూలికలు, చెట్లతోపాటు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటి అనేక జీవజాతులు హెచ్‌సీయూ అడవిలో ఉన్నట్టు తేల్చి చెప్పింది. దీంతో హెచ్‌సీయూ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలన్న వాదనలు వచ్చినప్పుడు ఉదయ్‌కృష్ణ నేతృత్వంలోని ‘వాటా ఫౌండేషన్’ జీవజాలం పక్షాన పోరాటాన్ని కోర్టుకు తీసుకెళ్లింది. తెలంగాణ హైకోర్టులో వారు దాఖలు చేసిన పిటిషన్లో ఈ భూమి రియల్ ఎస్టేట్ కంటే ఎంతో గొప్పదని పేర్కొంది. ఇదొక జీవవైవిధ్య ఆశ్రయ స్థలమని, ఇక్కడ జీవిస్తున్న అనేక జీవజాతులకు అది అభయారణ్యమని వాటా ఫౌండేషన్ వాదించింది.
హైదరాబాద్‌ను ఆకర్షించేది చెరువులు, వారసత్వ భవనాలు మాత్రమే కాదు.. నగరంలో ప్రత్యేకత కలిగిన రాతి నిర్మాణాలు కూడా నగర అభివృద్ధికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిలో ప్రసిద్ధ మష్రూమ్ రాక్ (పుట్టగొడుగు శిల) ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది కేవలం భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతిఘటనకు ప్రతీకగా మారింది. పర్యావరణపరంగా సుసంపన్నమైన ఈ భూమిని వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో మష్రూమ్ రాక్ ఉద్యమానికి ముఖ చిత్రంగా మారింది.
విద్యార్థులు ఈ రాయి చుట్టూ చేరి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ హైదరాబాద్ సహజ వారసత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ద్వారా నిబంధన సంఖ్య 13ను తీసుకొచ్చారు. ఈ చట్టం కారణంగా దేశంలో శిలలను సహజ వారసత్వంగా గుర్తిస్తూ చట్టబద్ధంగా రక్షించే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. అయితే తర్వాత హెరిటేజ్ యాక్ట్ వచ్చినా ఈ సహజ అద్భుతాలను కాపాడే బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేకపోయింది.
సొసైటీ టు సేవ్‌రాక్స్ వైస్ ప్రెసిడెంట్ సంగీతావర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ శిలలు దాదాపు 2 బిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. ఈ ప్రాచీన శిలా నిర్మాణాల చుట్టూ ఉన్న ప్రాంతాలను తొలగించడం వల్ల ఇప్పటికే తీవ్రమవుతున్న హైదరాబాద్ నీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ శిలా ప్రాంతాలు భూగర్భ జలాల నిల్వలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రకతి సమతుల్యతకు ఎంతో అవసరమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఎప్పటి నుంచో విప్లవ నిరసనలకు సారథ్యంవహిస్త్తూ వస్తున్నారు. యువత వారి తాజా ఆలోచనలు, కొత్త పద్ధతులు ఈ ఉద్యమాలకు కొత్త ఊపును ఇచ్చాయి. 2010 అరబ్ స్ప్రింగ్‌లో యువత ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మొబిలైజేషన్ ద్వారా నియంతత్వ పాలనకు సవాల్ విసిరిన సందర్భం నుంచి గ్లోబల్ ైక్లెమేట్ స్ట్రైక్స్‌లో స్కూల్ పిల్లలు ప్రేరణగా మారిన దాకా ఈ చరిత్ర సాగుతూ వస్తోంది. ముంబైలో ఆరే అడవి రక్షణ ఉద్యమం నుంచి ఈశాన్య భారతంలో ఆదివాసీ అడవులు కాపాడే గడ్డిపాల ఉద్యమాలు వరకు విద్యార్థులు సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున మద్దతును సమీకరించారు. హెచ్‌సీయూ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్ ద్వారా హెచ్‌సీయూలో జరుగుతున్న దమనకాండను లోకానికి ఉన్నదిఉన్నట్టు చూయించారు. దీంతో ఈ ఉద్యమం యావత్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిచింది.
మష్రూమ్ రాక్ మాత్రమే కాకుండా హెచ్‌సీయూలో బఫెలో సరస్సు, హై రాక్స్, వర్జిన్ రాక్స్, పీకాక్ సరస్సు వంటివి కూడా ఉన్నాయి. ‘400 ఎకరాల్లో ఉన్న ఈ జీవజాతులు, చెట్లను ఎక్కడికి తరలిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని యూనివర్సిటీ సమీపంలో నివసించే నల్లగండ్ల నివాసి దిగ్విజయ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఎప్పుడూ ధైర్యసాహసాల నగరంగా నిలిచింది. ఇక్కడి ప్రజలు తాము ప్రేమించే ప్రకృతిని, వారసత్వాన్ని కాపాడేందుకు ఎప్పుడూ ఒక్కటై నిలిచారు. చేవెళ్ల గగ్గిళ్ల వృక్షాల నుంచి దామగుండం అరణ్యాల వరకు, ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ గ్రీన్‌హార్ట్ కోసం జరుగుతున్న పోరాటం వరకు నగర ప్రజలు ఎల్లప్పుడూ తమ సహజ సంపదను కాపాడేందుకు ముందుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.
డిజిటల్ యుగానికి చాలా కాలం ముందే, స్మార్ట్ఫోన్లు లేకపోయినప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు లెక్చరర్లు, విద్యార్థులు హెచ్‌సీయూలోని మష్రూమ్ రాక్ దగ్గరికి వెళ్లి దాని నీడలో ఓదార్పు పొందేవారు. ప్రేరణ పొందేవారు. హైదరాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని, సినిమా నిర్మాత-దర్శకురాలు ఉమా మాగల్ మాట్లాడుతూ.. ‘పూర్వ విద్యార్థులకు మష్రూమ్ రాక్ అనేది కేవలం గతకాల జ్ఞాపకం మాత్రమే కాదు, అది సజీవ జ్ఞాపకం. తమ యవ్వనంలో శాశ్వత భాగం’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని పురాతన గ్రానైట్ రాళ్లు కూడా కాలప్రమాణాన్ని తట్టుకుని నిలిచి, మానవ చరిత్రకు సాక్షిగా నిలిచాయి.” హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి ఉమా మగల్ అన్నారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన భార్యకు ఈ మష్రూమ్ రాక్ వద్దే ప్రపోజ్ చేయడం విశేషం.
హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉన్న మష్రూమ్ రాక్ దాదాపు 200 కోట్ల సంవత్సరాల నాటిదని సేవ్ రాక్స్ సొసైటీ సెక్రటరీ ఫ్రాకే ఖాదర్ తెలిపారు. భూమి పొరలు ఒకదానికొకటి రాపిడికి గురవ్వడం వల్ల 200 ఏండ్ల కిందట ఈ శిల ఏర్పడినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ మొత్తంలో ఇలాంటి శిల నిర్మాణం మరెక్కడా కనిపించలేదని గుర్తు చేశారు. ఈ రాయి చుట్టూ ఏదైనా నిర్మాణాలు లేదా తవ్వకాలు జరిగితే, మష్రూమ్ రాక్ ఉనికికే ప్రమాదమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కంచ గచ్చిబౌలిలోని పచ్చిక మైదానంలో కనిపించే జీవ వైవిధ్యం, వృక్ష జాతులు ఈ భూప్రపంచ మీద మరెక్కడా కనిపించదని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ అరుదైన సాలీడును 2010లో ఇక్కడే కనుగొన్నట్టు చెప్తున్నారు. దానికి హైదరాబాద్ పేరు వచ్చేలా.. ముర్రిషియా హైదరాబాదెన్సీస్ అని నామకరణం చేసినట్టు రికార్డులు చూయించారు. హెచ్‌సీయూ వాతావరణంలో తప్ప మరెక్కడా ఈ జాతి సాలీడు కనిపించడంలేదని, ఈ కంచ గచ్చిబౌలి పర్యావరణానికి ఈ సాలీడు అలవాటు పడిపోయిందని చెప్తున్నారు.
కుల వృత్తులకు దిక్సూచిగా మారిన శతాబ్దాలనాటి వృక్షాలకు కూడా కంచ గచ్చిబౌలి భూములు కీలకంగా ఉన్నాయి. ఉదాహరణకు ముప్పై, నలభై ఏండ్ల కిందట చెరువుల్లో బట్టలు ఉతికే చాకలి వాళ్లు.. దుస్తులను మార్కింగ్ చేయడానికి చాకలి జీడి (వాషర్‌మ్యాన్ నట్ లేదా మార్కింగ్ నట్) చెట్ల గింజలను వినియోగించేవారు. ఈ గింజతో మార్కింగ్ చేసి ఎవరి బట్టలు ఏమిటన్న విషయాన్ని దోబీ సోదరులు గుర్తించేవారు. తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి వారసత్వంగా నిలిచిన చాకలి జీడి వంటి చెట్లు హెచ్‌సీయూలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటి ఉనికి కూడా ప్రమాదంలో పడిపోయింది.
తమ హెచ్‌సీయూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పచ్చని ప్రదేశాలను కాపాడుకోవడానికి విద్యార్థులు పోరాడటం ఇదే తొలిసారి కాదు. యూనివర్సిటీ గతంలోనూ అనేక నిరసనలను చవిచూసింది. విద్యార్థులు, అధ్యాపకులు ఇద్దరూ కలిసి ఒకేతాటిపై నిలబడి తమ ప్రాంగణ సహజ ఆవాసాలను కాపాడుకోవడానికి గతంలోనే ఎన్నోసార్లు ఉద్యమించారు.
అభివృద్ధి కోసం పర్యావరణాన్ని పణంగా పెట్టడాన్ని హెచ్‌సీయూ సిబ్బంది ధైర్యంగా ప్రతిఘటించారు. చెట్లు, ఖాళీ స్థలాలను కాపాడుకోవడం గురించి మాత్రమే వారు పోరాడటం లేదు. అభయారణ్యాన్ని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో వారు అప్పుడూ ఇప్పుడూ పోరాడుతున్నారు. యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ హస్సేన్ పదవీ కాలంలోనూ వర్సిటీలో ఇలాంటి నిరసనలే జరిగాయి. వైద్య కళాశాల స్థాపన కోసం కేర్ ఫౌండేషన్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు గతంలో వ్యతిరేకించారు. దీంతో ఈ నిర్ణయాన్ని వర్సిటీ అధికారులు పక్కనబెట్టారు. 2010లో వర్సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్‌ను స్థాపించాలనే దాని ప్రణాళికపై వ్యతిరేకత ఎదురైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును వర్సిటీ పక్కన పెట్టింది. యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమైన విద్య, పరిశోధన కంటే వాణిజ్య వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తుండటంపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దసర పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడటం ఏండ్ల నుంచి తెలంగాణ సమాజం అనుసరిస్తున్న ఆచారం. కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలు కూడా ఆశ్రయం పొందుతున్నాయి. అడవుల నరికివేత పెరుగడంతో జీవ, పక్షి జాతులతోపాటు పాలపిట్టల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. కంచ గచ్చిబౌలి అభయారణ్యంలో శతాబ్దాలుగా పాలపిట్టలు నివాసం ఉంటున్నాయి. అయితే, రేవంత్ ప్రభుత్వ చర్యలతో మన రాష్ట్ర పక్షి పాలపిట్ట కూడా ప్రమాదంలో పడినట్లయ్యిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్షీరదాలు
మచ్చల జింకలు
అడవి పందులు
ముళ్ల పందులు
కుందేలు
ప్యాంగొలిన్లు
రస్సెల్స్ వైపర్
నాగుపాము
ఇండియన్ రాక్ పైథాన్
ఇండియన్ క్రైట్స్
ఇండియన్ మానిటర్ బల్లి
రాబందులు
హాక్స్
కొంగలు
కార్మోరెంట్లు
హెరాన్లు
ఐబిస్
ఫ్లెమింగోలు
పెలికాన్లు
ఇండియన్
పిట్టలు
పికాక్ లేక్, బఫెలో లేక్ మరో మూడు సరస్సులు కూడా..
నెమలి
మచ్చల జింక
నాలుగు కొమ్ముల జింక
నక్షత్రపు తాబేలు
ఫ్లాప్ షెల్స్
అడవి పందులు
ఇండియన్ రాక్ పైథాన్
బూడిద రంగు ముంగీస
ముళ్ల పందులు
మానిటర్ బల్లులు
కుందేలు
బోవా పాములు
నాగుపాము
రస్సెల్స్ వైపర్
క్రెయిట్
క్వైల్స్
రాబందులు
హాక్స్
గ్రౌస్
క్వయిల్స్
ఏషియన్ ఓపెన్ బిల్
పెయింటెడ్ స్టార్క్
కార్మోరెంట్లు
అన్హింగాలు
పెలికాన్లు
హెరాన్లు
ఐబిస్ పక్షులు
కొంగలు
ప్యాంగోలిన్లు
క్రైట్స్
ఫ్లెమింగోలు
వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 షెడ్యూల్ 1 కింద రక్షించాల్సిన ఏడు జీవజాతులు కంచ గచ్చిబౌలి భూములను తమ ఆవాసంగా చేసుకొని ఏండ్లుగా నివసిస్తున్నాయి. అయితే, రేవంత్ ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో ఇప్పుడు ఈ జీవుల ఉనికి ప్రమాదంలో పడినట్లయ్యింది. వన్యప్రాణుల చట్టం ప్రకారం ఈ జీవులను రక్షించాలంటూ పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో పూల మొక్కలు, సాధారణ వృక్షాలే కాదు.. ఆధునిక జీవనశైలి రోగాలను నయం చేయగల శక్తి కలిగిన ఔషధ వృక్షాలు, సుగంధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ వృక్షాలు ప్రమాదంలో చిక్కుకొన్నాయి.