హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది. గత కేసీఆర్ ప్రభుత్వం శాసనమండలిలో రెండు ఖాళీల భర్తీకి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడంపై సమగ్ర న్యాయ విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్ల విచారణార్హతతోపాటు గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్ష పరిధిపై కూడా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎమ్మెల్సీగా నియమించాలని మంత్రివర్గ ఆమోదం మేరకు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తిరసరించడాన్ని దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ల విచారణార్హతపై ఫిబ్రవరి 8న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని ప్రకటించింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ మంత్రిమండలి సిఫారసు చేసిన ఎమ్మెల్సీ నామినేషన్లను గవర్నరు తిరసరించడాన్ని సవాలు చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తాం
ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు వినిపిస్తూ, గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. మంత్రివర్గం తీసుకునే నిర్ణయానికి గవర్నర్ ఆమోదం చెప్పాల్సిందేనని అన్నారు. మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుని తీరాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు ఎలాంటి విచక్షణాధికారం లేదని తెలిపారు. గత జూలైలో శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిందని, దీనిని గవర్నర్‌కు నివేదిస్తే ఆ రెండు పేర్లకు ఆమోదం చెప్పకుండా నిరుడు సెప్టెంబర్ 19న తిరసరించారని చెప్పారు. గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించి తీరాలని తెలిపారు. గవర్నర్ నిర్ణయాలను న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదంటూ పిటిషన్ల హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని 361వ అధికరణలో నిర్దేశించిన మేరకు అభ్యంతరాలను వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు.
పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలు
గవర్నర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అశోక్ఆనంద్కుమార్ ప్రతివాదన చేస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 361ప్రకారం పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఆ దశలో ఏజీ కల్పించుకొని అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న కారణంగా తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల నియామాకాలు చేపట్టరాదన్న నిషేధం ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని చెప్పింది. ఈ వివాదాన్ని పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ ఎమ్మెల్సీల నియామక వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదనే నిర్ణయం తీసుకున్నారని గవర్నర్ తరఫు న్యాయవాది చెప్పారు. కోర్టులో వివాదం తేలేదాకా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని చెప్పారు.
గవర్నర్‌కు విచక్షణాధికారాలు ల్లేవు
‘గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. గవర్నర్ కోటా కింద శాసనమండలిలో ఖాళీలను భర్తీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మంత్రివర్గ ఆమోదానికి అనుగుణంగా సాహిత్యం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో అనుభవం ఉన్న వారిని నామినేట్ చేసే అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. గవర్నర్ ప్రభుత్వ సిఫార్సును తిరసరించడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలి. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ ఆమోదించి తీరాలి. గవర్నర్ నిర్ణయం ఏకపక్షం. చట్ట విరుద్ధం. గవర్నర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారు. మంత్రివర్గ సిఫార్సులను ఆమోదించడం గవర్నర్ కార్యనిర్వహక విధి. రాజ్యాంగంలోని 171(5) అధికరణం ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారాలు లేవు. ఆ అధికరణంలో గవర్నర్‌కు ‘ప్రత్యేక విజయాల’ ప్రస్తావన లేనప్పటికీ, పిటిషనర్ల సామర్ధ్యంపై అంచనాకు వచ్చి తిరసరించడం చెల్లదు’ అని ఇద్దరు పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేరొన్నారు.