
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్‌లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ఉన్నప్పుడు బాధితులు సివిల్ కోర్టులో కేసులు వేసేందుకు ఆసారం ఉండదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో కేసు వేద్దామంటే అకడ విచారణకు కేంద్రం సభ్యులనే నియమించడంలేదని, ఇది పూర్తిగా న్యాయ నిరాకరణే అవుతుందని మండిపడింది. ఈ విధానాన్ని ఇంకెంత కాలం కొనసాగిస్తారని నిలదీసింది. ఇదే తీరును కొనసాగించదల్చుకుంటే ట్రిబ్యునళ్లను మూసేయాలని స్పష్టం చేస్తూ కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు జారీచేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో సభ్యులను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ట్రిబ్యునళ్లలో సభ్యులను నియమించకపోవడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది.