హైదరాబాద్, జనవరి 11(నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్ రైతులు పాదయాత్ర నిర్వహించడానికి అనుమతించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నిరసన తెలియజేసే హకు రైతులకు కూడా ఉన్నదని స్పష్టంచేసింది. రైతులు తమ సమస్యలపై ఆందోళన చేస్తామని ముందుకు వస్తే స్వాగతించాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల యజమానులే ఇకడ పిటిషనర్లని, ఫార్మాసిటీ ఏర్పాటుకు నిరసన తెలిపే హకును రైతులు కోల్పోరాదని పేర్కొంది. రైతుల నిరసనకు అనుమతిని నిరాకరిస్తూ ఇబ్రహీంప ట్నం ఏసీపీ ఈనెల 2న జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు నిరసన తెలియజేసేందుకు అనుమతించాలని, పాదయాత్రలో నేరచరిత్ర ఉన్న వాళ్లు పాల్గొనరాదని షరతులు విధించింది. శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందనుకుంటే రైతులకు పోలీసులు షరతులు విధించవచ్చునని స్పష్టం చేసింది. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనవరి 2 నుంచి పాదయాత్ర, కరపత్రాల పంపిణీ ద్వారా తోటి రైతులకు అవగాహన కల్పించడానికి అనుమతి మంజూరు చేయాలని కోరుతూ పోలీసులకు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి రైతులు వినతి పత్రం సమర్పించారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతిని నిరాకరిస్తూ రాచకొండ డివిజన్ ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి తరపున ఎం సాయిరెడ్డి సహా ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపి పైఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం తమ భూములను లాకుంటున్నదని, దీనిపై నిరసన తెలపడంతోపాటు తోటి రైతులకు అవగాహన కల్పించే అవకాశం ఇవ్వడంలేదని తెలిపారు. యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిగూడ, తాటపర్తి గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారని, ఆయా ప్రాంతాల రైతులందరికీ అవగాహన కల్పించే ప్రయత్నాన్ని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, రైతుల నిరసనకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.