హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హిల్ట్ పాలసీపై ప్రభుత్వ పెద్దలు, అధికారుల్లో తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మంత్రి వర్గంలోని కొంతమందికి ఈ పాలసీ తీసుకురావడం ఇష్టంలేకపోవడంతో దీనిపై స్పందించడానికి విముఖత చూపుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పాలసీ వ్యవహారాల్లో తలదూర్చకుండా దూరం పాటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే పాలసీ రూపకల్పన వెనుక భారీకుట్ర జరుగుతున్నదని, కాంగ్రెస్ సర్కారు, సీఎం ఆధ్వర్యంలో రూ.5 లక్షల కోట్ల రియల్ దందా జరుగుతున్నదని, పరిశ్రమల పేరిట ప్రభుత్వం డేంజర్ గేమ్ ఆడుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్‌పరం చేసి కాంగ్రెస్ పెద్దలు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తూ విషయాన్ని ప్రజలకు చేరవేసింది.
అందులో మల్టిపుల్ జోన్ పేరిట ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని పేర్కొంది. పారిశ్రామికవాడలను మల్టిపుల్ జోన్‌గా మార్చేందుకు చేస్తున్న కుట్రలను పర్యావరణవేత్తలు, మేధావులు కూడా తప్పుపడుతున్నారని కథనాలు ప్రచురించింది. కథనాలపై రీజాయిండర్ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖ, కాలుష్య నియంత్రణ మండలికి సీపీఆర్వో పేరిట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలోని లొసుగులను బట్టబయలు చేసిన నమస్తే తెలంగాణపై మరేదైనా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.
హిల్ట్ మసి తమకు అంటకూడదని పర్యావరణ మంత్రి, కాలుష్య నియంత్రణ మండలి భావిస్తున్నట్టు సమాచారం. హిల్ట్ మొత్తం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని, దానికి సంబంధించిన ఏ వ్యవహారంలోనూ తాము జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే లేఖ వచ్చి వారం అవుతున్నా స్పందించలేదని తెలుస్తున్నది.