హైదరాబాద్: సికింద్రాబాద్లోని (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో అమ్మవారి వేచిఉన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి బోనం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లల వేచిఉన్నవారికి మంచి నీళ్లు, ప్రసాదాలు అందజేస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆదయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు.