Harish Rao | గోదావరి నల్లమల సాగర్‌కు పాలమూరు రంగారెడ్డికి లింక్ పెట్టడమంటే.. తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా లభించిన నదీ జలాలపై రాజీపడటమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పాలకులు కృష్ణా జలాలను బనకచర్ల రూపంలో కృష్ణార్పణం చేశారని అన్నారు. ఇప్పుడు గోదావరి జలాలపై ద్రోహం తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నష్టం జరిగిందంటే అక్కడి నేతలే పాలకులుగా ఉన్నారని తెలిపారు. కానీ స్వరాష్ట్రంలో పాలకుల చేతిలో అన్యాయం జరిగితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి బనకచర్ల అని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని తెలిపారు. ఆ కుట్రలను బయటపెట్టిందే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పోలవరం బనకచర్లతో అన్యాయం జరుగుతుందని ప్రశ్నించామని తెలిపారు.
గోదావరి జలాలను కృష్ణా పరివాహకానికి తరలిస్తే జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. 14-21-45 రేషియో ప్రకారం హక్కులు సంక్రమిస్తా హరీశ్‌రావు తెలిపారు. 14 కర్ణాటకకు, 21 మహారాష్ట్రకు, 45 తెలంగాణకు సంక్రమిస్తాయని వివరించారు. పోలవరం విషయంలో అవార్డు పాసైందని వెల్లడించారు. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు తీసుకెళ్తే ఇవే హక్కులు సంక్రమిస్తాయని స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు బనకచర్ల కాదు.. నల్లమలసాగర్ అని చంద్రబాబు అంటున్నారని తెలిపారు. కృష్ణాలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు ఉందని ఒక ఫేజ్ తగ్గించి, గోదావరి నల్లమల సాగర్ అని రెండో ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పారు.
గోదావరిలో మిగులు జలాలే లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మిగులు జలాలపై గలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రమే స్పష్టం చేసిందని వెల్లడించారు. అందుకే ఇప్పుడు మూడో ప్లాన్ అమలుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గోదావరి-కావేరి ఇంటర్ లింకింగ్‌ను ముందుకు తెచ్చారని తెలిపారు. 2014 నుంచి గోదావరి -కావేరి అంశం తెరపైకి వచ్చిందని అన్నారు. మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇంటర్ లింకింగ్ చేపట్టాలని అప్పుడు తాము సూచించామని తెలిపారు. 9,968 టీఎంసీల టీఏసీ క్లియర్ అయినంకనే ఇంటర్ లింకింగ్ చేయాలని చెప్పామని అన్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ ద్వారా ఇంటర్ లింకింగ్‌కు ఉపయోగించాలని చెప్పామన్నారు. కానీ పోలవరం -నల్లమలసాగర్-కావేరి ద్వారా కుట్ర జరుగుతుందని తెలిపారు.
తెలంగాణకు అన్యాయం జరిగేలా మూడో ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ భూభాగం టచ్ కాకుండా గోదావరి నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే కుట్రకు తెరలేపారని అగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా జాతీయ ప్రాజెక్టు కింద నిర్మించుకునే యత్నం చేస్తున్నారని అన్నారు. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలని అంటున్నారని.. దీనికి డూడూ బసవన్నల లెక్క రేవంత్ రెడ్డి తలూపుతున్నాడని మండిపడ్డారు.
2015 జనవరి 6వ తేదీన నిర్వహించిన సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రిగా హాజరయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. మాకు 1050 టీఎంసీల అవసరం ఉంది, మా అవసరాలు తీరినంకనే ఇంటర్ లింకింగ్ రివర్స్ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించామని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు లింక్ చేసేందుకు నాటి కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, ఏపీ మంత్రి దేవినేని ఉమ ఒప్పుకున్నారని తెలిపారు. తెలంగాణ సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం చెప్పిందని అన్నారు. సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్‌కు అడ్డగోలుగా భూసేకరణ చేయొద్దని చెప్పామన్నారు. తక్కువ భూమి తీసుకున్న మంచి పరిహారం ఇస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు.
పోలవరం నుంచి కావేరి లింక్ పెడితే తెలంగాణకు అన్యాయం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎందుకు నోరు తెరవడం లేదని మండిపడ్డారు. బనకచర్లకు అనుమతిస్తే పాలమూరుకు ఎన్వోసీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. దీనివల్ల పాలమూరు జిల్లాకు , గోదావరికి నష్టమే అని స్పష్టం చేశారు.