Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులు ఆపి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం హరీశ్‌రావు సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇవాళ అరిగోస పడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదని అన్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారని పేర్కొన్నారు. అంటే మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా అని ప్రశ్నించారు.
వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచారని తెలిపారు. కేంద్రం కొనకున్నా, రైతులకు నష్టం కలగకుండా కేసీఆర్ కొనుగోలు చేశారని చెప్పారు. మీకు చేతనైతే ఢిల్లీ పోయి కొట్లాడండి కానీ రైతులను నట్టేట ముంచకండని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి.. కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని డైలాగులు కొడుతున్నారని తెలిపారు. నా నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, ఖాతా, వెంకటాపూర్, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్, ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి, రావురూక్ల, రాఘవాపూర్, మల్లారం, సికిందలాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు నాకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని డీఎస్ఓ దృష్టికి తీసుకెళ్తే మీరు మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని చెప్పారు.
ఏ ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని.. రైతులు మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో రాస్తారోకోలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదని హరీశ్‌రావు తెలిపారు. రోహిణీ కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కల్లాల్లోనే ముగ్గుతున్నాయని పేర్కొన్నారు. మూడో వంతు మాత్రమే కొన్నారని, ఇంకా రెండు వంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయని అన్నారు. వర్షాలకు మురుస్తూ వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చుని మిషన్ మోడ్ అని పేపర్ టైగర్ లా డైలాగులు కొడుతున్నాడని అన్నారు. మీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయని విమర్శించారు.
ముఖ్యమంత్రిది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్ అని హరీశ్‌రావు విమర్శించారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. మార్చి 22న సిద్దిపేట గడ్డ మీద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చి 45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుబంధు వేస్తా అని సీఎం చెప్పాడని.. ఇవాళ్టికి 63 రోజులైందని తెలిపారు. ఇంతవరకు రెండు ఎకరాల వారికి తప్ప మిగతా రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు రాలేదని అన్నారు.
కొమురెల్లి మల్లన్న, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ఏడుపాయల అమ్మవారు, మెదక్ చర్చి.. ఇలా కనబడ్డ దేవుళ్లందరి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పాడని అన్నారు. ఎన్సాన్ పల్లి కేంద్రంలో నెలన్నర రోజుల్లో కేవలం ఆరు లారీలు మాత్రమే వచ్చాయని తెలిపారు. వానలకు వడ్లు తడిసి, కింద సీసీ లేక మట్టిలో కలిసిపోయి చెదలు పడుతున్నాయన్నారు. లారీలు, సంచులు పంపాలని రైతులు మొత్తుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి 60 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టిండు. నీ ఢిల్లీ ట్రిప్పులతో మాకు వచ్చిందేమీ లేదు. ముందు ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచు అని సూచించారు.
ఎన్సాన్ పల్లిలో కనకయ్య అనే రైతు కనీసం సంచులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని.. నీ గారడీ మాటలు బంద్ చేసి, తక్షణమే గన్నీ బ్యాగులు పంపించమని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారని అన్నారు. మీరు ఎన్ని తిట్టినా పడతాం, కానీ రైతులకు కాంటాలు పెట్టండి, లారీలు పంపించండి అని సూచించారు. నాగలక్ష్మి అనే మహిళా రైతు మక్కలు అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదని అన్నారు. వెంటనే మక్కలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా నేనే వేలాది మంది రైతులను వెంటబెట్టుకుని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.