సిరిసిల్ల టౌన్/హుజూరాబాద్ టౌన్/హనుమకొండ, అక్టోబర్ 29 : విద్యుత్తు చార్జీలు పెంచుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈఆర్సీలో ఎండగట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలిచిన కేటీఆర్కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ తెలిపారు. విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరణ, విద్యుత్తు సబ్సిడీ 10 హెచ్పీ నుంచి 25 హెచ్పీలకు వర్తింపజేస్తూ వెల్లడించిన ఈఆర్సీ ప్రకటనను స్వాగతిస్తూ బీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో మంగళవారం కేటీఆర్ చిత్రపటానికి కార్మికులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో ప్రభుత్వ సహకారంతో కేటీఆర్ సిరిసిల్ల నేతన్నల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు, రైతులు, ప్రజలతో కలిసి సంబురాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి బైక్పై నకలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ భవన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అకడకి చేరుకున్న సుబేదారి, హనుమకొండ పోలీస్స్టేషన్ సీఐలు, పోలీసు సిబ్బంది కార్యాలయ గేట్లను మూసి వేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చే క్రమంలో పోలీసులు వాటిని లాకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి టీజీ ఎన్పీడీసీఎల్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.