ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8: గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కోసం ఎంతో ఉన్నత ఆశయంతో హరితహారంలో (Harithaharam) భాగంగా నాటించిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాల్లో ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నాయి. కానీ కొన్నిచోట్ల కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం మొక్కలు ధ్వంసం అవుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మంచాల మండలం ఎల్లమ్మ తండా బోడకొండ మధ్యలో తోడు వెంట ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మొక్కలు ధ్వంసం అయ్యాయి. ఇది చూసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో మొక్కలు పెద్ద ఎత్తున కాలి బూడిద అయ్యాయి.
గత ప్రభుత్వంలో ఎంతో ఉన్నత ఆశయంతో గ్రామ గ్రామాన హరితహారం లో భాగంగా నాటిన పలు రకాల మొక్కలు ఏపుగా పెరిగి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ మొక్కలకు ప్రతిరోజు నీళ్లు అందించడం చెట్ల మొదల వద్ద చెత్తాచెదారం తొలగించడం కంటి పనులు గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తుండేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ మొక్కల సంరక్షణను గ్రామపంచాయతీ సిబ్బంది అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో నాలుగైదు సంవత్సరాలుగా ఎంతో ఎక్కువగా పెరిగిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా హరితహారం మొక్కలను సంరక్షించాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.