హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్రవ్యాప్తంగా పరుచుకున్న పచ్చదనం దేశానికి ఆదర్శంగా ఉన్నదని ‘గ్రీన్ తమిళనాడు మిషన్’ డైరెక్టర్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ కొనియాడారు. తన రెండు రోజుల తెలంగాణ పర్యటనలో హరితహారం అమలును అధ్యయనంచేశారు. పర్యావరణ సవాళ్లను ఎదురోవడంలో భాగంగా ‘గ్రీన్ తమిళనాడు మిషన్’ పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రానున్న పదేండ్లలో 265 కోట్ల మొకలను నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎనిమిదేండ్లుగా అమలవుతున్న హరితహారం ఫలితాలను దీపక్ వివిధ ప్రాంతాల్లో పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్- రామగుండం రహదారితోపాటు సిద్దిపేట జిల్లాలో అటవీ పునరుద్ధరణ పనులు- ఫలితాలను స్వయంగా చూసిన దీపక్ శ్రీవాత్సవ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఒక ప్రాధాన్య పథకంగా పచ్చదనం పెంపును తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం సీఎం కేసీఆర్ ముందుచూపునకు, దూరదృష్టికి నిదర్శనమని దీపక్ శ్రీవాత్సవ అన్నారు.
ఈ మొకలు చెట్లుగా మారిన తర్వాత కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించటంలో గణనీయంగా పనిచేస్తాయని అన్నారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత దీపక్ శ్రీవాత్సవ అరణ్య భవన్లో పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్తో సమావేశమయ్యారు. తమిళనాడు, తెలంగాణ అటవీశాఖలు అమలుచేస్తున్న కార్యక్రమాలు, మెట్టుపాళ్యం అటవీ కళాశాల పరిధిలో చేపట్టిన ఆగ్రో ఫారెస్ట్రీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. యూనివర్సిటీగా రూపాంతరం చెందుతున్న తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ), ములుగులో చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలపై మాట్లాడారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద రైతులను ప్రోత్సహించి పల్ప్‌వుడ్, ఫ్లైవుడ్ తయారీకి అవసరమైన చెట్లు పెంచటం ద్వారా అదనపు ఆదాయం పొందేలా చూడవచ్చని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఫారెస్ట్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని దీపక్ శ్రీవాత్సవ చెప్పారు. సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్లు రామలింగం, సైదులు, డిప్యూటీ కన్జర్వేటర్ శాంతారాం, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అటవీ రక్షణకు మరింత ప్రాధాన్యం
రాష్ట్రంలో అడవుల అభివృద్ధి, సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ సర్కిళ్లపై పర్యవేక్షణ చర్యలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రతి సర్కిల్‌కి పీసీసీఎఫ్ స్థాయి అధికారికి అటవీశాఖ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని భద్రాద్రి-చార్మినార్ సర్కిల్‌కు పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్, కాళేశ్వరం, కేటీఆర్, ఆర్డీ సర్కిల్స్, హైదరాబాద్ సర్కిల్‌కు పీసీసీఎఫ్ ఎంసీ పర్గేయిన్, రాజన్న బాసర సర్కిల్‌కు పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరు, యాదాద్రి డైరెక్టరేట్ జూపార్క్‌కు, ఎస్టీసీ సర్కిల్‌కు పీసీసీఎఫ్ వినయ్‌కుమార్, ఏటీఆర్ సర్కిల్‌కు పీసీసీఎఫ్ సునీత భాగవత్, జోగులాంబ సర్కిల్‌కు పీసీసీఎఫ్ జీ రామలింగంకు పర్యవేక్షణ బాధ్యతలిచ్చింది. అటవీ సర్కిల్లో ప్రతి ఒక్క ఉన్నతాధికారి అడవిలో అభివృద్ధి పనులను తప్పక పరిశీలించాలని సూచించింది.