సిద్దిపేట, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ట్రిప్పులు వేయడం వల్ల రైతులకు వచ్చే ప్రయోజనమేమీ లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రికి రైతులంటే చిన్నచూపు అని, యూరియా సరఫరాలో, రైతుబంధు వేయడంలో, కరెంట్ సరఫరాలో, ఆరుగాలం కష్టించి పండించిన పంట కొనడంలోనూ ఈ ప్రభుత్వం ఫెయిలైందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, బీఆర్ఎస్ హయాంలోనైనా రైతులు ఎన్నడూ ఇంత ఇబ్బందులు పడలేదని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని, కేంద్రం 51 లక్షలే కొంటామంటున్నదని సాకు చెప్తున్నాడని విమర్శించారు. అవసరమైతే కేంద్రం వద్దకు పోయి ధర్నా చేయాలని సూచించారు. కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్వో దృష్టికి తీసుకెళ్తే మీరు మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని చెప్పారు.వడ్ల కుప్పల మీదనే రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని మిషన్ మోడ్ అంటూ పేపర్ టైగర్‌లా డైలాగులు కొడుతున్నాడని విమర్శించారు. మీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడుతాయని ఎద్దేవా చేశారు. రైతులకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు, జొన్నల రైతులకు డబ్బులు పడుతలేవని వారికి డబ్బులు విడుదల చేయాలని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాజనర్సు, రవీందర్ రెడ్డి, ప్రశాంత్, సంపత్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.