Revanth Reddy | సిద్దిపేట, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షాక్ అయ్యారు. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్‌బ్లాక్ అయ్యింది. మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపర్చాయ’ని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరారని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని మలాపూర్, కోనాయిపల్లి, నర్సంపల్లి గ్రామ పంచాయతీల కొత్త పాలకవర్గాలు, అచ్చంపేట నియోజకవర్గం, సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు హైదరాబాద్‌లో హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు మండల సర్పంచ్‌లతోపాటు గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్‌లను ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో సతరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో తెలంగాణకు ఒక అవార్డు కూడా రాలేదని చెప్పారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని, కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రతినెలా పల్లెలకు నిధులు విడుదలచేసేవారని చెప్పారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు బంద్ అయ్యాయని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, బీజేపీ నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివని, ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పేది సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాదని, సబ్కా బక్వాస్ అని మండిపడ్డారు. బీజేపీ కేవలం ఉత్తర భారతదేశ పక్షానే ఉంటుందని, తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం గోధుమలకు మద్దతు ధర పెంచి, మన వడ్లకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేసినందుకు ఒకొక రైతు ఎకరానికి రూ.ఏడు వేలు నష్టపోయారని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండి ఉంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు నిధులు తెచ్చేవాళ్లమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పైకి కొట్టుకున్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాయి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
-హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో బీజేపీ నుంచి గెలిచిన నర్సింహారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు, ఓబుళాపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్‌రావు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు.
దేశం వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా వెళ్తున్నది. బహుశా మరో ఆరు నెలల్లోనో, ఏడాదిలోనో ఎన్నికలు రావొచ్చు. రెండేండ్లలో కచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
-హరీశ్‌రావు
బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలను హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్ఎస్లో గెలిచిన వారిని బలవంతంగా కాంగ్రెస్ లో చేర్చుకోవాలని చూస్తే కుదరదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని, కాంగ్రెస్ బెదిరింపులకు లొంగరని చెప్పారు. ‘గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండండి. మళ్లీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో మన గ్రామాల న్నీ పయనిస్తాయి’ అని హరీశ్‌రావు చెప్పారు.