హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ ఒక వ్యక్తి కాదని, లక్షల మంది కార్మికుల సమూహశక్తి అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్‌ని ముట్టుకుంటే భస్మమైపోతావ్ రేవంత్‌రెడ్డీ, తస్మాత్ జాగ్రత్త’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. సోమవారం ఏసీబీ విచారణ పూర్తి చేసుకొని తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌ను హరీశ్‌రావు ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ తన 18 నెలల పాలనలో కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని, 420 హామీల ఊసే లేదని, మాట తప్పినందుకు రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్‌రెడ్డి?’ అని ప్రశ్నించారు.
దేశంలోని అనేక రాష్ర్టాలు ఫార్ములా ఈ రేసింగ్ కోసం పోటీపడుతుంటే కేటీఆర్ తన శక్తియుక్తులు ఉపయోగించి హైదరాబాద్‌కు దానిని తీసుకొచ్చి, రాష్ట్ర గౌరవాన్ని పెంచారని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్‌రెడ్డి మాత్రం అందాల పోటీలతో రాష్ట్రం, దేశం పరువును తీశారని, మన కీర్తిని మంటగలిపారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి పాలనలో తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ‘కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టో, బీఆర్ఎస్ కార్యకర్తలను కష్టపెట్టో, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టో, సోషల్ మీడియా వారియర్స్‌ను కష్టపెట్టో, కేసులు పెట్టో అటెన్షన్‌ను డైవర్ట్ చేద్దామనుకుంటుండు’ అని హరీశ్‌రావు అన్నారు. ‘కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, నీ అరాచకాలను ఎత్తిచూపితే కేసులు, లగచర్ల రైతులకు బేడీలేసిన కేసులను ఎత్తిచూపితే, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావ్. జాగ్రత్త’ అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు.