హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాజకీయ జోక్యం, టెండర్ల ప్రక్రియలో మార్పుల ద్వారా సింగరేణికి వందల కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో భారీగా విధానపరమైన అవకతవకలు, ఆర్థికనష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 తర్వాత జరిగిన అన్ని టెండర్లు, విధానపరమైన మార్పులపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖపై హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కే మాణిక్‌రావు, కోవా లక్ష్మి సంతకాలు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై జరిపిన అన్ని టెండర్లను వెంటనే రద్దు చేయాలని, అక్రమాలపై మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్ల బాధ్యతను ఫిక్స్ చేయాలని డిమాండ్‌చేశారు. సింగరేణికి వెంటనే పూర్తిస్థాయి సీఎండీని నియమించాలని కోరారు.
లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు
‘2024లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నది. ఇది కేవలం తమకు నచ్చిన సంస్థలకే టెండర్లు దకేలా చేసేందుకు, పోటీని నిరోధించేందుకు చేసిన కుట్ర. దాదాపు 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో నిబంధనలు ఉల్లంఘించి, జాతీయ సగటు కంటే అధిక ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. దీనివల్ల సుమారు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇది భారీ అవినీతికి దారితీస్తున్నది. అలాగే పేలుడు పదార్థాల కొనుగోలులో కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక ధరలు చెల్లిస్తున్నారు. ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో రూ.1,044 కోట్ల టెండర్లను సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి అనుయాయులకు దక్కేలా అక్రమాలకు పాల్పడుతున్నారు. నైని కోల్ బ్లాక్ విషయంలోనూ అక్రమాలు జరిగాయి. అక్రమ నిర్ణయాలకు సహకరించని అధికారులను వేధిస్తున్నారు. డైరెక్టర్ హోదాలో ఉన్నవారిని బలవంతంగా రాజీనామా చేయించడం లేదా డిమోషన్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు.