హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకోవాలని, అందుకోసం వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రా న్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ జలహక్కులను కాపాడాలని, అందుకోసం చేసే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నాబేసిన్ మళ్లించేందుకు గోదావరి – బనకచర్ల లింకు ప్రాజెక్టును సుమారు రూ.80 వేల కోట్లతో చేపడుతున్నదని, అందుకోసం ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడమేగాక ఇటీవల ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను కూడా సమర్పించిందని, కేంద్రం సైతం ఆ నివేదికను తెలంగాణ సహా అన్ని గోదావరి పరీవాహక రాష్ర్టాలకు పంపినట్టుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. పీఎఫ్ఆర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం జీబీలింక్ను మూడు సెగ్మెంట్లుగా విభజించారని, పోలవరం జలాశయం నుంచి ప్రకాశం బరాజ్‌కు, అక్కడి నుంచి 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన బొల్లపల్లి కృత్రిమ జలాశయానికి, బొల్లపల్లి జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు నీటిని తరలించనున్నారని తెలిపారు. ప్రాజెక్టు పనులను కొనసాగించకుండా ఏపీని నిరోధించాలని కోరుతూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉతమ్ లేఖ రాయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా జీబీ లింక్
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం – 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు గోదావరి / కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని, కానీ ఏపీ ఆ నిబంధలన్నీ ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణం కోసం ముందుకు సాగుతున్నదని, టెండర్లు కూడా పిలిచేందుకు సిద్ధమవుతున్నదని హరీశ్ వివరించారు.
969 టీఎంసీల వాటా ఉన్నా వాడుకోలేని దుస్థితి
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా ఆ నదిలో తెలంగాణ వాటా 969 టీఎంసీలు అని, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జీవోల ద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు ఆ మేరకు నీటి కేటాయింపులు చేశారని, కానీ నాడు ఆ మేరకు ప్రాజెక్టులు నిర్మించలేదని, తెలంగాణ వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించి దాటలేదని వివరించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం లక్ష్యంతో గోదావరి బేసిన్లో అనేక భారీ ప్రాజెక్టులు చేపట్టారని, పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ సర్కారు చర్యల ఫలితంగా గోదావరి జలాల వినియోగం గణనీయంగా 600 టీఎంసీలకు పెరిగిందని వివరించారు.
జలాల పూర్తి స్థాయి వినియోగం కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని, ముఖ్యంగా కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల కాలువల తవ్వకం పూర్తి చేసి గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగంలోకి తేవాల్సి ఉన్నదని తెలిపారు. ఏపీ ఇప్పటికీ తెలంగాణ వాటా 969 టీఎంసీలను వ్యతిరేకిస్తూనే ఉన్నదని, తమ వాటా 775 టీఎంసీలని వాదిస్తున్నదని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం 2023లోనే ఏపీ కేంద్రానికి లేఖ రాసిందని, ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే జీబీ లింకు ప్రాజెక్టును అమలు చేసి 200 టీఎంసీలపై హకులను కోరాలన్నదే ఏపీ పన్నాగమని వివరించారు. దాని వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పొందిన వాటాకు గండి పడనున్నదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసివస్తం
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా అవసరాలకు తరలించుకోవచ్చని, ఆ మేరకు కృష్ణా నీటిని నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకునేందుకు అనుమతించిందని, మహారాష్ట్రకు 14 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను కేటాయించి ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతించిందని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రమే ఉన్నది కనుక ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని, అందుకే ఆ నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించామని వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు పోరాడి సెక్షన్ 3 కింద విచారణకు అదనపు టీవోఆర్‌ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఇప్పించడంలో విజయం సాధించిందని, అందులో భాగంగా 45 టీఎంసీల కేటాయింపు అంశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించిందని, ఆ నీటిని తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగిన చర్యలు చేపట్టాలని, రాజకీయాలకు తావు లేకుండా బీఆర్ఎస్ తోడుగా నిలబడుతుందని హరీశ్ స్పష్టంచేశారు.
తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టులు కాళేశ్వరం 3వ టీఎంసీ, సమ్మక సాగర్, బీఆర్ అంబేదర్ వార్ధా డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నయి. వాటికి అనుమతులు రాకుండానే.. మన వినియోగాలు పూర్తి స్థాయిని అందుకోకముందే ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటయి.
– హరీశ్‌రావు
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉన్నది కాబట్టి భేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. లేదంటే ప్రత్యేక శాసనసభా సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై ఒక విధానపరమైన
నిర్ణయాన్ని తీసుకోండి.
– హరీశ్‌రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాలను మాత్రమే తరలిస్తామంటున్నది. కానీ, గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నికరజలాలు, అదనపు జలాలు అన్న విభజనే లేదు. ఆల్ వాటర్స్ మాత్రమే. కాబట్టి గోదావరి జలాల తరలింపునకు బదులు కృష్ణా నికర జలాల్లో 157.5 టీఎంసీల నీటి డిమాండ్‌ను కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఉంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. న్యాయ నిపుణులతో చర్చించాలి.
– హరీశ్‌రావు