హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా రేవంత్‌రెడ్డి ప్రవర్తన ఉన్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తానే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం రేవంత్‌రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
కేసీఆర్, ఆయన కుటుంబంపై రేవంత్‌రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయిని దిగజార్చడం కాదా? కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలంటున్న రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.హింసాత్మక వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తున్న రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.