హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము లేవనెత్తిన అంశాలపై తమకు ఇప్పటికీ సమాధానాలు రాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానాలు ఇప్పించాలని మంగళవారం ఆయన శాసనసభ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు (అన్స్టార్డ్) సమాధానాలు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు.
అసెంబ్లీ నిబంధనావళి (52 (1)) ప్రకారం సభ్యులు అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలను సభా టేబుల్‌పై అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని, గడిచిన అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు రాలేదని తెలిపారు. ప్రజల కోసం అసెంబ్లీలో ప్రశ్నలు అడగటం, సకాలంలో వాటికి సమాధానాలు పొందటం శాసనసభ సభ్యుల హక్కు అని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు.