సిద్దిపేట, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి క్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ వేదిక వద్ద కల్యాణ వేడుక నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మణికంఠ శివాచార్య మహాస్వామీజీ (మహారాష్ట్ర బార్సి) పర్యవేక్షణలో మల్లన్న కల్యాణోత్సవం జరిపించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వెలేటి రోజాశర్మ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మల్లన్న కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 60 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. గత రెండేండ్ల కంటే ఈసారి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి.
కేసీఆర్‌తో మల్లన్న ఆలయం అభివృద్ధి:మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్ సంకల్పంతోనే కొమురవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కొమురెల్లి మల్లన్న పేరు మీద 50 టీఎంసీల సామర్థ్యంతో రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్ నిర్మించారన్నారు. కొన్ని నెలల క్రితమే దానిని ప్రారంభించుకొని, మల్లన్న దయతో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొన్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా మల్లన్న ఆశీస్సులతో పనులు సకాలంలో పూర్తి చేసుకొని లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చామని స్పష్టంచేశారు. ఏడేండ్లలో రూ.30 కోట్లతో మల్లన్న క్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, కరోనా పీడ విరుగడై ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మల్లన్నను కోరుకొన్నట్టు మంత్రి పేర్కొన్నారు.