Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తేతెలంగాణ): ఫోర్త్ సిటీ పేరిట రేవంత్ బ్రదర్స్ సాగిస్తున్న అరాచకాలు, అమృత్ స్కీంలో బావమరిది బాగోతాలు, ఫార్మాసిటీ ముసుగులో బంధువుల అక్రమాలు, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట సాగించిన లూటిఫికేషన్‌ను ఆధారాలతో ఎత్తిచూపినందుకే కేటీఆర్‌పై ఈ కార్ రేస్ పేరిట సీఎం అక్రమ కేసు బనాయించారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీ ముమ్మాటికీ డొల్ల కేసు అని స్పష్టంచేశారు. కేసులో అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులివ్వడంతోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారని అభిప్రాయపడ్డారు. అవినీతికి అవకాశమే లేని ఒప్పందంలో ఏసీబీతో విచారణ చేయించడమేమిటని నిలదీశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, చింత ప్రభాకర్, వివేకానంద, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ఫార్ములా-ఈపై వాస్తవాలు చెప్పేందుకు చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
ఇతర రాష్ర్టాల్లోనూ రేస్‌లు
తెలంగాణ తర్వాత మహారాష్ట్ర సైతం ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు ముందుకొచ్చిందని హరీశ్ గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేటీఆర్‌ను అభినందించారని గుర్తుచేశారు. రూ.42 కోట్లతో తమిళనాడు ఫార్ము లా-4, రూ. 1700 కోట్లతో ఉత్తరప్రదేశ్ ఫార్ములా-వన్ నిర్వహించాయని, చంద్రబాబు సైతం అమరావతికి తీసుకెళ్లేందుకు యత్నించారని చెప్పారు. ‘ఇందులో అక్రమాలకు అవకాశముంటే ఆ రాష్ర్టాలు ఎందుకు నిర్వహిస్తాయి? అంటే ఆయా రాష్ర్టాలు కూడా అవినితీకి పాల్పడ్డట్టేనా?’ అంటూ ప్రశ్నలు సంధించారు.
అవినీతి లేదని మంత్రి పొన్నమే చెప్పారు
ఫార్ములా ఈ-రేస్ అగ్రిమెంట్ కింద ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నగదు ట్రాన్స్ఫార్మర్ చేశారని ఆరోపించిన మంత్రి పొన్నం ప్రభాకరే ఇందులో అవినీతి జరగలేదని చెప్పారని హరీశ్ గుర్తుచేశారు. ‘రాష్ట్ర ఖజానా, నేషనల్ బ్యాంకు నుంచి నగదు పంపించారు.. ఇర్రెగ్యులారిటీ తప్ప ఇల్లీగల్ ఏమీలేదు’ అని స్పష్టంచేశారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి అక్రమ కేసుల పేరిట నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
దుష్ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చారు
రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి రాష్ట్రం దివాలా తీసిందని గోబెల్స్ ప్రచారం చేసిందని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు అనుసరించిన దగాకోరు విధానాలతో ఏడాదిలోనే తెలంగాణను దివాలా తీయించారని దునుమాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని అబద్ధాలు చెప్పిన రేవంత్‌రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా దిమ్మతిరిగే సమాధానమిచ్చామని చెప్పారు. రేవంత్‌రెడ్డికి విజన్ లేదు..విస్డమ్ లేదు..పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన తయారైంది’ అంటూ ఎద్దేవా చేశారు.
రైతుల నుంచి పోలీసులదాకా కేసులే
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో నిరసన తెలిపిన వారిపై నిర్బంధాలు అమలు చేసి అణచివేతకు పాల్పడిందని హరీశ్ ధ్వజమెత్తారు. లగచర్ల రైతులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పోలీసు కుటుంబాలు, ప్రతిపక్షాలపై కేసులు బనాయించి దుర్మార్గాలకు ఒడిగట్టిందని దుయ్యబట్టారు.
ప్రతిష్ఠ పెంచడమే కేటీఆర్ తప్పా?
గతంలో ఐటీ, ఇండస్ట్రియల్ మంత్రిగా కేటీఆర్ అనేక ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలను తెచ్చి హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచారని హరీశ్ గుర్తుచేశారు. అందుకే హైదరాబాద్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్నదని స్పష్టంచేశారు. ‘గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌ను ఈవీ రంగంలో పెట్టుబడులకు డెస్టినేషన్‌గా మార్చడం..తెలంగాణ సంపద పెంచేందుకు ప్రయత్నించడమే కేటీఆర్ చేసిన తప్పా? అందుకే ఆయనపై కేసు పెట్టారా?’ అని నిలదీశారు.
24 గంటల్లోనే ఈడీ ఎందుకొచ్చింది?
ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన 24 గంటల్లోపే ఈడీ కేసు నమోదు చేయడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని హరీశ్ విమర్శించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి 80 రోజులు దాటినా కనీసం స్టేట్మెంట్ ఇవ్వని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఇప్పుడు ఆగమేఘాలమీద స్పందించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ‘ఇది బడేభాయ్..చోటే భాయ్ ఫెవీకాల్ బంధానికి నిదర్శనం’ అని ఎద్దేవాచేశారు. ఏదేమైనా రేవంత్ సర్కారు కుట్రలు, కుతంత్రాలకు దిగినా పోరాట నేపథ్యమున్న బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-కేసులో అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులివ్వడంతోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ డొల్ల కేసు. ఈ వ్యవహారంలో నిజంగా అక్రమాలే జరిగితే కేటీఆర్‌ను ఏ1గా చేర్చి, ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీపై కేసెందుకు పెట్టలేదు?
-హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి పాలన పిచ్చిడి చేతిలో రాయిలా మారింది. రైతుల నుంచి సినిమా యాక్టర్ల దాకా అందరిపై కేసులు పెట్టడం, బుకాయింపులు, బనాయింపులు, దబాయింపులు తప్ప ఈ సర్కార్ ఒరగబెట్టిందేమిటి? దగాకోరు విధానాలతో ఏడాదిలోనే రాష్ర్టాన్ని దివాలా తీయించారు.
-హరీశ్‌రావు
ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కేటీఆర్ పెంచితే, తుగ్లక్ చర్యలతో రేవంత్‌రెడ్డి డ్యామేజ్ చేశాడు. రేస్‌తో రాష్ర్టానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 600 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఒప్పందాన్ని రద్దుచేసి రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి రూ. 600 కోట్ల నష్టాన్ని మిగిల్చారు.
-హరీశ్‌రావు
పొంగులేటి ఇంటిపై దాడులు చేసి 80 రోజులు దాటినా కనీసం స్టేట్మెంట్ ఇవ్వని ఈడీ అధికారులు, ఇప్పుడు ఆగమేఘాలమీద స్పందించడంలో ఆంతర్యమేమిటి? ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన 24 గంటల్లోపే ఈడీ కేసు ఎలా నమోదైంది? ఇది బడేభాయ్..చోటే భాయ్ ఫెవీకాల్ బంధానికి నిదర్శనంకాదా?
-హరీశ్‌రావు
కేటీఆర్‌పై కేసు ఎత్తేసేదాకా పోరు: సిరికొండ
కేటీఆర్‌పై అక్రమ కేసును ఎత్తేసేదాకా పోరాటం ఆపబోమని మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. కేసీఆర్ మంత్రిగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి తెలంగాణ ప్రతిష్ఠను పెంచితే.. రేవంత్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకే కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: మహమూద్‌అలీ
కాంగ్రెస్ ఏడాది పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నదని ఎమ్మెల్సీ మహమూద్ అలీ విమర్శించారు. తెలంగాణను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేసిన కేటీఆర్‌పై ప్రభుత్వం అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు పోరాటలు కొత్తకాదని స్పష్టంచేశారు.
రాజకీయ కక్ష సాధింపు: సబితాఇంద్రారెడ్డి
రాజకీయ కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు పెట్టిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో అక్రమ కేసులు పెడుతున్నదని తెలిపారు.
రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్తాం: సత్యవతి రాథోడ్
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
కేటీఆర్‌పై కేసు నమోదు అక్రమం: కృష్ణారావు
కేటీఆర్‌పై కేసు నమోదు అక్రమమని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు విమర్శించారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
అప్రజాస్వామికం: జోగు రామన్న
రాష్ట్ర శ్రేయస్సుకు పాటుపడిన కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో చర్చ పెట్టాలి: పద్మా దేవేందర్‌రెడ్డి
ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రేస్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించి, నగరం ఇమేజీని కేటీఆర్ పెంచారని కొనియాడారు.
రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్: విద్యాసాగర్‌రావు
రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌తో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించి రాష్ట్ర ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై కేసులను ఖండిస్తున్నామని తెలిపారు.
కక్షపూరితంగానే కేటీఆర్‌పై కేసు: కంచర్ల, రావుల
ప్రశ్నించడాన్ని సహించలేక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. గ్యారెంటీలపై పెరుగుతున్న అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే కేసు: రవీంద్రకుమార్
కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసు బనాయించి కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు నమోదు చేసి రాష్ట్ర పరువు తీస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణ చూస్తూ ఊరుకోదు: బడుగుల
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజనేత కేటీఆర్ జోలికొస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. కేటీఆర్‌ను తప్పుడు కేసులతో అరెస్టు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు.
రేవంత్‌ను ఏ1గా చేర్చాలి: గొంగిడి
కేటీఆర్‌ను అక్రమంగా టచ్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు సహించబోవని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ రేస్‌తో ఏటా రూ.700 కోట్లు సమకూర్చే ఆదాయానికి గండికొట్టిన కేసులో రేవంత్‌రెడ్డినే ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా రేస్‌లో అవినీతే జరగలేదు: బాజిరెడ్డి
ఈ రేసింగ్ పోటీల్లో అవినీతి జరగనేలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తేల్చిచెప్పారు. ఒప్పందం ప్రకారమే పోటీలు జరిగాయని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన సీఎం నాటకాలాడుతున్నారని విమర్శించారు.
కేటీఆర్ అంటే రేవంత్‌కు వణుకు: మాలోత్ కవిత
ఫార్ములా -ఈ కార్ రేస్‌పై కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని మాజీ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. కేటీఆర్‌పై కేసు రాజకీయ కక్షలో భాగమేననని స్పష్టం చేశారు.
ప్రజాపాలన పేరిట దుర్మార్గాలు: క్రాంతి కిరణ్
నిత్యం ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై రాజకీయ కక్షతోనే అక్రమ కేసు పెట్టారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలు : గండ్ర
కాంగ్రెస్ సర్కార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల జాబితాలో చేర్చిన గొప్ప నేత కేటీఆర్ అని కొనియాడారు.
కేసులే రేవంత్ టార్గెట్: సండ్ర, చంద్రవతి, కొండబాల
బీఆర్ఎస్ను దెబ్బతీయాలని తమ పార్టీ నాయకులపై కేసులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రవతి విమర్శించారు. హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు తేవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-రేస్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు.
రేవంత్‌రెడ్డిపైనే కేసు పెట్టాలి: దాస్యం, పెద్ది, చల్లా, నన్నపునేని
ప్రపంచపటంలో తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపిన కేటీఆర్‌పై కాకుండా రాష్ట్ర పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపైనే కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని, మరో ఉద్యమం ఎగిసిపడుతుందని స్పష్టం చేశారు.