సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి ట్రిబ్యునల్ నివేదికలు పరిశీలించకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చిచెప్పడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం తెలిపారు. బనచర్ల ముసుగులో గోదావరి జలాలను తరలించుకుపోయే చంద్రబాబు సర్కారు కుట్రలకు ఈ నిర్ణయం చెంపపెట్టు అని సోమవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పోరాట ఫలమని, తెలంగాణ ప్రజల విజయమని స్పష్టంచేశారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేలా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసేవరకు విశ్రమించబోమని స్పష్టంచేశారు. అంతిమ విజయం సిద్ధించేదాకా పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు.