సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో సోమవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు బీహెచ్ఈఎల్ లో అత్యధికంగా 1.45సెం.మీలు, టోలిచౌకిలో 1.40సెం.మీలు, లింగంపల్లిలో 1.33సెం.మీలు, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో 1.23సెం.మీలు, ఖాజాగూడ, సఫిల్‌గూడలో 1.1సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించిన అధికారులు నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.1డిగ్రీలు, గాలిలో తేమ 52శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.