హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం జీవో నంబర్ 97 పేరుతో లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని, సెప్టెంబర్ 7లోగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
కళాశాల వద్దకు చేరుకున్న ఆయన, ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా ఆ కళాశాల పూర్వ విద్యార్థిగా వారి పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 59 ప్రభు త్వ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆ రోపించారు. సిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) ప్రాతిపదికన నడిచే ఒక ప్రైవేట్ సంస్థ అని, దానికి ప్రభుత్వం మూడేండ్లు మాత్రమే మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాలు, భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు ఆస్తులు సరిపోలేదా రేవంత్‌రెడ్డి? ఇప్పుడు పాలిటెక్నిక్ ఆస్తులు కావాలా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మహబూబాబాద్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థి గొంతును ఓ సీఐ పట్టుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, విద్యార్థులేమైనా టెర్రరిస్టులా..? అని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. సూర్యాపేటలో ఒక విద్యార్థిని అరెస్ట్ చేస్తే అమ్మాయిలంతా వెళ్లి పోలీసులను చుట్టుముట్టి విడిపించుకొచ్చారని, విద్యార్థుల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నానని అభినందించారు. జెన్-జీ తరానికి చెందిన విద్యార్థులు కేవలం రీల్స్, వీడియోలకే పరిమితం కాదని, తమ హకుల కోసం రోడ్డెకి పోరాడే యోధులని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో నీట్ పరీక్షపై జరిగిన ఆందోళనల తరహాలోనే తెలంగాణలోనూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ప్రభుత్వానికి వేడి పుట్టిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం వేసే దొంగ కమిటీలతో ఎలాంటి ఉపయోగం లేదని, కమిటీల డ్రామాలు ఆపి తక్షణమే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉర్దూ యూనివర్సిటీ, హెచ్‌సీయూ, అగ్రికల్చర్ యూనివర్సిటీల భూములు లాక్కున్న ప్రభుత్వం, ఇప్పుడు పాలిటెక్నిక్ ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, నాయకులు కిశోర్‌గౌడ్, సుమిత్రానంద్, తుంగ బాలు, కడారి స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.