హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావుకు మేనమామ సాలు వచ్చిందని, కానీ ఎన్నటికీ సీఎం కాలేరని, కేసీఆర్, కేటీఆర్ వాడుకుంటున్నారని వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. తమ నాయకుడు కేసీఆర్ చూపిన బాటలోనే బీఆర్ఎస్ నేతలందరూ నడుస్తారని, తామేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోలేదని విమర్శించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పటివరకు బయట ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ లోపలికి వచ్చి మరీ మాట్లాడారు. అది తాము ఎప్పుడో చేసిన వ్యాఖ్యలని, అదీగాక తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని, ఆ వ్యాఖ్యలు పదే పదే అనడం తగదని హరీశ్‌రావుకు సూచించారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటేనే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని హరీశ్‌రావు స్పీకర్‌కు వెల్లడించారు. తుదకు మంత్రి శ్రీధర్‌బాబు సూచనల మేరకు హరీశ్‌రావు వ్యాఖ్యలను మాత్రమే స్పీకర్ సభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు హరీశ్‌రావు యత్నిస్తున్న క్రమంలో స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అవకాశమిచ్చారు. దీంతో మైక్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని హరీశ్‌రావుకు అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. కానీ ఆ వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేచి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి అభ్యంతరంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆక్షేపించారు. స్పీకర్‌ను డిక్టేట్ చేయడమేమిటని నిలదీశారు. ఒకరు అవకాశమివ్వాలని చెప్తే, మరొకరు వద్దంటూ వారించడమేమిటని మండిపడ్డారు. ఆ తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్ అవకాశమిచ్చారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం కాకపోయినా సీఎం భవనం మాత్రం వచ్చిందని అనగా సభలో నవ్వులు పూశాయి. మహేశ్వర్‌రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేస్తుండగా, స్పీకర్ పదే పదే వారించారు. దీంతో ఆయన.. తమది సభలో రెండో అతిపెద్ద ప్రతిపక్షపార్టీ అని, 8 మంది సభ్యులం ఉన్నామని చెప్పి, మరింత సమయం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం విడుదల శ్వేతపత్రంపై బీజీపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సభలో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం విడుదల చేయడం బాగానే ఉన్నదని, అలా అని ఇచ్చిన హామీలకు ఎగనామం పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలని, 412 హామీలను కూడా నెరవేర్చాలని, లేదంటే ప్రజల తరఫున ప్రశ్నిస్తామని అన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను ఎలా నెరవేర్చుతుంది? అని ప్రశ్నించారు. నిధులను ఎలా సమకూర్చనున్నదనే విషయాన్నీ సభకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.