మెదక్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రైతులు, సామాన్యుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్‌ను, రేవంత్‌రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిషేధ జాబితాలో పెట్టి ఓడించడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను ఎండగతూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమరభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి బాండ్ పేపర్లు రాసిచ్చి వెయ్యి రోజులైనా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. పింఛన్ రూ.4వేలు. రైతుబంధు రూ.15వేలు, అక్కాచెల్లెళ్లకు నెలకు రూ.2,500, విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఏ ఒక్క హామీకి అతీగతీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమలు చేస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ 60లక్షల మందికి రైతుబీమా ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఆగస్టు 13 వరకు ప్రీమియం కట్టకపోవడంతో రైతుబీమా బంద్ అయిందని, కరువు వచ్చినా, కరోనా వచ్చిన పెద్ద నోట్లు రద్దయినా కేసీఆర్ రైతుబంధును ఆపలేదని పేర్కొన్నారు. రైతు బంధు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఎగ్గొట్టి, రైతులకు ఇవ్వాల్సిన రూ.29 వేల కోట్ల రైతు బంధును లూటీ చేశారని నిప్పులచెరిగారు.
కేసీఆర్ హయాంలో రైతులకు 24గంటల కరెంట్ సరఫరా చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 10గంటలకు మించి ఉండటం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు ఎలాంటి ఎరువుల సమస్య లేకుండా సరఫరా చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో యాప్‌ల పేరుతో రైతుల చెప్పులను లైన్లో పెట్టి ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ.900 ఉన్న డీఏపీ బస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,100 చేసిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి యూరియా దొరకని పరిస్థితి తెచ్చిందన్నారు. పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులు కంటతడి పెట్టిస్తున్నారని విమర్శించారు. ఎండాకాలంలో హల్దీ, మంజీరా నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి మల్లన్నసాగర్ ద్వారా నీళ్లు పారించి వేల ఎకరాల్లో పంటలను కాపాడిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వతానిదని వివరించారు. రేవంత్ వచ్చాక కాళేశ్వరంపై కక్షతో రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్లను డెడ్ స్టోరేజీకి తెచ్చారని మండిపడ్డారు.
కౌడిపల్లిలో అందరికీ రుణమాఫీ జరిగిందని తేల్చితే తాము రాజీనామా చేస్తామని, ఒకవేళ మాఫీ కాలేదని తేలితే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్‌రావు సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి 77 సార్లు ఢిల్లీకి వెళ్లి, వెయ్యి రోజుల్లో దాదాపు 300 రోజులు అక్కడే ఉన్నారని, దీని వల్ల ఫ్లైట్ టికెట్లు దండుగ తప్ప రాష్ర్టానికి తెచ్చింది సున్నా అంటూ చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, మోసాలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం 13లక్షల మందికి కల్యాణలక్ష్మి ఇస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి బంద్ పెట్టారని, మహాలక్ష్మి కింద ఒక్కో ఆడబిడ్డకు రూ.82,500 బాకీ పడ్డారని తెలిపారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగలు ఇస్తామని నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటున్న రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి సీఎంగా ఉండటమే అతిపెద్ద క్రిమినల్ వేస్ట్ అని దుయ్యబట్టారు. కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్ పీఏసీఎస్‌లో ఒక్క గింజ వడ్లు కొనకుండానే కాంగ్రెస్ నేతలు రూ.కోటీ స్వాహా చేశారని ఆరోపించారు. పీఏసీఎస్‌లో జరిగిన కుంభకోణం చిట్టా తమ వద్ద ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో సాగునీటి కాలువల్లో నీళ్లు పారట్లేదు, తుమ్ము చెట్లు మొలుస్తున్నాయంటూ నర్సాపూర్ నియోజకవర్గం రెడ్డిపల్లిలో ఆగిపోయిన కాలువ వద్ద నిల్చొని రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్‌రెడ్డి పగబట్టారని నిప్పులుచెరిగారు. కేసీఆర్ హయంలో 85శాతం పూర్తయిన టన్నెల్, మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇదని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని ప్యాకేజీ 18, 19 కింద కేసీఆర్ ఆద్భుతమైన ప్రణాళిక చేశారని చెప్పారు. లిఫ్ట్ ద్వారా సింగూర్‌లోకి గోదావరి నీళ్లు నింపి సస్యశ్యామలం చేసేందుకు సంకల్పం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ నిలిచిపోయిన మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.